Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో దళితుడిపై రాళ్లదాడి
న్యూఢిల్లీ : వివాహ తంతులో భాగంగా గుర్రంపై ఊరేగింపుగా వెళ్తున్న పెండ్లి కుమారుడిపై రాజస్థాన్లో ఒక సామాజిక వర్గానికి చెందినవారు రాళ్లదాడికి పాల్పడ్డారు. దళితుడైన పెండ్లి కుమారుడు గ్రామంలో గుర్రంపై ఊరేగింపుగా వెళ్లరాదని రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందినవారు అభ్యంతరం వ్యక్తం చేశారని, కావాలనే తన కుమారుడిపై రాళ్లదాడి చేశారని పెండ్లి కుమారుడి తండ్రి ఆరోపించాడు. ఊరేగింపు సమయంలో పక్కన పోలీసులున్నా రాళ్లదాడి జరిగిందని ఆయన చెప్పారు. జైపూర్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాళ్లదాడి ఘటనలో 12మంది పోలీసులు కూడా గాయపడ్డారని ప్రాగ్పురా స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివ్ శంకర్ వర్మ స్థానిక మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో 10మంది నిందితుల్ని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వారిపై ఆరోపణలు నమోదుచేశామన్నారు. ''దళితుల వివాహా వేడుకల్లో పెండ్లి కుమారుడు గుర్రంపై ఊరేగింపుగా వెళ్లటాన్ని ఒక సామాజిక వర్గం సహించలేక పోతోంది. అడ్డుకోవటం ఇది మొదటిసారి కాదు. ''అని పెండ్లి కుమారుడి తండ్రి బాలారు చెప్పాడు.