Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ
- ఆల్కహల్ సేవిస్తున్న పురుషులు 18.8 శాతం.. మహిళలు 1.3 శాతం మంది : 'ఎన్ఎఫ్హెచ్ఎస్' సమాచారం
న్యూఢిల్లీ : భారతదేశంలోని పురుషుల్లో మూడో వంతు మందికి పైగా పొగాకును వినియోగిస్తున్నారు. వీరిలో పొగాకును వినియోగిస్తున్నవారి సంఖ్య దాదాపు 38 శాతంగా ఉన్నది. అలాగే, ఆల్కహల్ను తీసుకుంటున్న వారి సంఖ్య 18.8 శాతంగా ఉన్నది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)' ఈ సమాచారాన్ని వెల్లడించింది.దేశంలో టొబాకో, ఆల్కహల్ వినియోగంపై తొలిసారిగా ఎన్ఎఫ్హెచ్ఎస్-5లో సమాచార సేకరణ జరగటం గమనార్హం. 2019-2021 మధ్య ఈ సర్వేను నిర్వహించారు. 15-49 ఏండ్ల మధ్య వయసున్న ఒక లక్ష మంది పురుషులు, 7.24 లక్షల మంది మహిళల నుంచి సమాచారాన్ని సేకరించారు.ఇక మహిళల్లో పొగాకు, ఆల్కహల్ వినియోగం పురుషులతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నది. భారత్‌లో 8.9 శాతం మంది మహిళలు (15 ఏండ్ల వయసు పైబడినవారు) పొగాకును ఉపయోగిస్తున్నారు. ఇక వీరిలో ఆల్కహాల్ సేవిస్తున్నవారి సంఖ్య 1.3 శాతంగా ఉన్నది.
గ్రామీణ ప్రాంతాల్లో అధికం
పొగాకు, ఆల్కహల్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉన్నది. మందుపై ఆంక్షలున్న గుజరాత్‌లోనూ 5.8 శాతం మంది పురుషులు ఆల్కహల్ను సేవిస్తున్నట్టు తేలటం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో పొగాకు వినియోగం జాతీయ సగటు కంటే ఎక్కువగా, 40 శాతానికి పైగా ఉండటం గమనార్హం. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర పొగాకు వినియోగం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రాష్ట్రాల్లోని పురుషుల్లో పొగాకును తీసుకుంటున్నవారు 50 శాతం మందికి పైగా ఉన్నారు. మిజోరంలో దీని వినియోగం అత్యధికంగా ఉన్నది. ఇక్కడ 72 శాతం మంది పురుషులు, 61.6 శాతం మంది మహిళలు పొగాకు అలవాటయ్యారు. ఇక త్రిపురలో 50 శాతం మందికి పైగా మహిళలు టొబాకోను వినియోగించటం గమనార్హం.
తెలంగాణలో మందుబాబులు 43శాతం మంది
ఆల్కహల్ కంటే పొగాకు వినియోగం అనేక రాష్ట్రాల్లో అధికంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఇందుకు రివర్స్‌కు గా ఉన్నాయి. పంజాబ్‌లోని పురుషుల్లో 22.8 శాతం మంది ఆల్కహల్, 12.9 శాతం మంది పొగాకును వినియోగిస్తున్నవారిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో పొగాకు లేదా ఆల్కహాల్‌ను వినియోగిస్తున్న మహిళల సంఖ్య 1 శాతం కంటే తక్కువగా ఉన్నది. ఆల్కహల్ను సేవిస్తున్న పురుషుల సంఖ్య 52 శాతంతో అత్యధికంగా అరుణాచల్‌ప్రదేశ్ ముందు స్థానంలో ఉన్నది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉన్నది. ఇక్కడ 43 శాతం మంది పురుషులు ఆల్కహాల్‌ను సేవిస్తున్నవారిలో ఉన్నారు.