Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 281కి చేరిన బాధితుల సంఖ్య
- కర్నాటకలోని ఎస్డీఎం మెడికల్ కాలేజీ మూసివేత
బెంగళూరు : కర్నాటకలోని ధార్వాడ్‌లో గల ఎస్డీఎం మెడికల్ కాలేజీలో మరో 77 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ కాలేజీలో కరోనా సోకినవారి సంఖ్య 281కి చేరింది. వీరిలో మెడికల్ కాలేజీ విద్యార్థులు, స్టాఫ్ ఉన్నారు. దీంతో వారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకినవారందరూ పూర్తిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందుకున్నవారే. అయినప్పటికి, వారికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఇటీవల కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీనే కరోనా వ్యాప్తికి కారణమైందని అధికారులు తెలిపారు. క్యాంపస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు-మూడు రోజులు జరిగింది. కాగా, కోవిడ్ క్లస్టర్ ఆందోళన కలిగించే అంశమని మణిపాల్ ఆస్పత్రి చైర్మెన్, కర్నాటకలో కోవిడ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ డాక్టర్ సుదర్శన్ బల్లాల్ వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న విద్యార్థులందరూ పూర్తిగా వ్యాక్సిన్‌ను పొందిన వారేననీ, ఇందులో రోగనిరోధక పలాయన దృగ్విషయం ఉన్నదని వివరించారు. అయితే, ఇది అంత తీవ్రమైనది కాదని ఆయన వెల్లడించారు. కాగా, కొత్త రకం వేరియంట్‌పై నిర్ణయానికి రావడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ సహాయపడుతుందని తెలిపారు. '' బెంగళూరులోని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రయివేటు లిమిటెడ్‌కు 113 పాజిటివ్ శాంపిళ్లను పంపారు. డిసెంబర్ 1 నాటికి జీనోమ్ సీక్వెన్సింగ్ పూర్తవుతుందని అంచనా'' అని రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ డి. రణ్‌దీప్ వెల్లడించారు. మెడికల్ కాలేజీ నుంచి దాదాపు మూడువేల శాంపిళ్లను కోవిడ్ టెస్ట్ కోసం పంపినట్టు జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ యశ్వంత్ ఏ మదిన్కార్ ఒక వార్తా సంస్థకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆస్పత్రిలో కొత్త రోగుల చేరికలను నిలిపివేశారు. ఆస్పత్రి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేశారు. ఇక ఇప్పటికే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యి ఉన్నవారిలో కరోనా నెగెటివ్‌గా వచ్చినవారినే డిశ్చార్జ్ చేస్తున్నారు. ఉత్తర కర్నాటక మెడికల్ హబ్‌గా ఉన్న ఎస్డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది.