Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రబీ సాగుపై ఆందోళన చెందుతున్న రైతు
- సమస్యను పట్టించుకోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం
న్యూఢిల్లీ : బీహార్‌లో ఎరువుల కొరత తీవ్రరూపం దాల్చింది. మొక్కజొన్న, గోధుమ, వరి..తదితర పంటలు వేసిన రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సమయానికి ఎరువులు వేయకపోతే దిగుబడి పడిపోయే అవకాశముంది. ''పంట పొలాల్ని సాగుకు సిద్ధం చేసుకున్నాం. డీఏపీ ఎరువు అందక పంట ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఎరువులు వేయకపోతే విత్తనాలు మొలకెత్తవు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. నా గ్రామంలో, పక్క గ్రామంలోని రైతులంతా ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. రబీ సాగులో కీలకమైన సమయం ఇది'' అని పూర్నియా జిల్లాలోని ఓ రైతు మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రంలో ఎరువుల సమస్య నెలకొంది. నితీశ్‌కుమార్ ప్రభుత్వం రైతుల గోడు వినే పరిస్థితి లేదు. దాంతో ఎరువుల కొరత రబీలోనూ కొనసాగుతోంది. రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల్ని తీసుకొచ్చే బాధ్యత నితీశ్ ప్రభుత్వానిదే. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెలువడుతున్నాయి. పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవాలా? డీఏపీ వెతుకులాటకు సమయాన్ని వృధా చేసుకోవాలా? అని మాధేపూరా జిల్లాకు చెందిన యాదవ్ అనే రైతు ప్రశ్నిస్తున్నాడు. రబీ సీజన్లో 4లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ కావాలని బీహార్ వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రానికి తెలిపారు. అయితే ఇందులో 1లక్ష మెట్రిక్ టన్నుల డీఏపీ మాత్రమే ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. కేటాయించిన దాంట్లో అరకొరగా కేంద్రం నుంచి బీహార్‌కు విడుదల కావటంతో రైతులంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని సమాచారం.
రైతులకు జీవనాధారం : మహేందర్ యాదవ్,
కన్వీనర్ 'కోశి నవ్ నిర్మాణ్ మంచ్'
రబీ సీజన్లో రైతులు పెద్ద సంఖ్యలో మొక్కజొన్న సాగుచేస్తారు. సీమాంచల్, కోశీ ప్రాంతంలో ఇదే ప్రధాన పంట.పూర్నియా,కిషన్‌గంజ్, ఆరేరియా,కతియార్,మాధేపూర్,సాహార్సా,సూపౌల్,ఖగరియా జిల్లాల్లో రైతు లకు జీవనాధారం ఇదే.భాగల్పూర్,సమస్తీపూర్ జిల్లాలోనూ పెద్ద ఎత్తున మొక్కజొన్న వేస్తారు.అన్ని జిల్లాల్లోనూ రైతులు ఎరువుల కోసం ధర్నాలు,నిరసనలు చేపడుతున్నారు.ఎరువుల కొరత వారిని వేధిస్తోంది. ఎరువుల దుకాణాల ముందు రాత్రి సమయం వరకూ పెద్ద సంఖ్యలో క్యూలుంటున్నాయి.