Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కమిటీ ప్రకటనతో ఎంఎస్పీపై రైతుల డిమాండ్ నెరవేరిందని అన్నారు. ఈ మేరకు శనివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తుందనీ, ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులకూ భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఈ కమిటీ పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చిస్తుందని అన్నారు. ''రైతు సమస్యలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం వంటి పలు అంశాలపై ఆ కమిటీ చర్చించనున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తరువాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్థంలేదు. రైతులు ప్రధానమంత్రి చేసిన ప్రకటనను గౌరవించాలి. పెద్ద మనసును ప్రదర్శించాలి. వారంతా తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని నేను కోరుతున్నాను'' అని తోమర్ అన్నారు. అలాగే పంట తీసిన తరువాత మిగిలిన పొట్టిను తగులబెట్టడాన్ని నేరంగా పరిగణించకూడదన్న రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పరిహారం విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర విధానం ప్రకారం పరిహారం అంశంపై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. మరోపక్క నిరసనల్లో భాగంగా రైతులపై పెట్టిన కేసులు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని మంత్రి అన్నారు. వాటి ఉపసంహరణపై రాష్ట్రాలదే నిర్ణయమన్నారు. కేసుల తీవ్రతను బట్టీ రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. అలాగే సోమవారం ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో మొదటిరోజే వాటి రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు.