Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ ఇచ్చే చట్టాన్ని రూపొందించడం సాధ్యంకాదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్పీ చట్టం చేసే అవకాశం లేదన్నారు. అలాగే ప్రభుత్వానికి అంత అవసరమూ లేదని వ్యాఖ్యానించారు. దీనిపై వ్యవస్థను రూపొందించలేమని చెప్పారు. తాము అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. అన్నారు. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై అది ఒత్తిడి తెస్తుందని తెలిపారు. ''ఇప్పటి వరకు దీనిపై (ఎంఎస్పీని క్రమబద్ధీకరించడంపై) ఎటువంటి చర్చలు జరగలేదు. వ్యవసాయ ఆర్థికవేత్తలు కూడా భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. దీనిపై చట్టాన్ని రూపొందించడం సాధ్యం అనిపించడం లేదు.
ఎంఎస్పీపై చట్టం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే దీనిపై చట్టం చేస్తే అప్పుడు రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది'' అని ఖట్టర్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, ప్రజలకు మంచి సందేశాన్ని అందించారని అన్నారు. ''ఆందోళనకు దిగిన రైతులు వెనక్కి వెళ్లిపోవాలి. రైతులు కచ్చితంగా వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 29న పార్లమెంటులో చట్టాన్ని రద్దు చేసిన వెంటనే రైతులు వెళ్లిపోవల్సి వస్తుంది'' అని తెలిపారు. ప్రధాని మోడీతో హర్యానాలో రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులతో సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు.