Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో దళితులపై దాడులు ఆగడం లేదు. ప్రయాగ్రాజ్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. దళిత కుటుంబానికి చెందిన నలుగురిని కొందరు దుండగులు గొడ్డలితో అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతులు భర్త (50), భార్య (47), కూతురు (17), కుమారుడు (10) లను పోలీసులు గుర్తించారు. అయితే, భూ వివాదంలో పెత్తందార్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు ఆరోపించారు. కాగా, హత్యకు ముందు 17 ఏండ్ల బాలికపై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసింది. ఫఫమౌ ప్రాంతంలోని గోహ్రీ మోహన్గంజ్ మార్కెట్లో ఈ దారుణం చోటు చేసుకున్నది. పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే ఈ ఘటన చోటు చేసుకున్నదని స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూ వివాదానికి సంబంధించి పెత్తందారీ కుటుంబం.. బాధిత కుటుంబాన్ని బెదిరించిందనీ, దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తిరస్కరించారిని వివరించారు. ఈ మేరకు నిరసనలు చేశారు. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు మోహరించారు. దుండగులు బాధితులపై గొడ్డలితో దాడి చేసినట్టు ప్రాథమికంగా తెలిసిందని డీఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠి వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబానికి చెందిన బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో హత్య, లైంగికదాడితో పాటు పలు సెక్షన్ల కింద 11 మంది నిందితుల పేర్లను చేర్చారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా బాధిత కుటుంబాన్ని కలిశారు. రాష్ట్రంలో బీజేపీ పాలనలో దళితుల పట్ల జరుగుతున్న దారుణాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వ్యతిరేక బీజేపీకి ఈ ఘటన ఒక మచ్చ అని సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఆందోళనకరంగా మారాయని బీఎస్పీ జాతీయాధ్యక్షురాలు, మాజీ సీఎం మాయావతి ట్వీట్ చేశారు.