Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్ తీసుకురావాలి
- రాజ్యాంగ దినోత్సవ ముగింపుసభలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ప్రాథమిక హక్కులు తెలియదు... విధులు మాత్రమే తెలుసు : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
- ఆమోదించే చట్టాల ప్రభావాన్ని చట్టసభలు అంచనా వేయటం లేదు : జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : న్యాయమూర్తులు అత్యంత విచక్షణతో వ్యవహరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కోర్టు గదుల్లో వ్యాఖ్యలు చేసే సమయంలో న్యాయవ్యవస్థ సంయమనం పాటించాలని సూచించారు. సుప్రీం కోర్టు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల ముగింపు సభ శనివారం స్థానిక విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చేసినా.. విచక్షణ రహిత వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను దిగజార్చేందుకు చోటు కల్పించినట్టవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను దూషిస్తున్న తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై అవమానకరమైన వ్యాఖ్యలు చోటుచేసుకోవడం నాకు అంతులేని బాధ కలిగిస్తున్నదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపై దాడులు పెరగడానికి గల కారణాలపై సమిష్టిగా పరిశీలించాలని సూచించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడానికి ఇదే అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, సివిల్ సర్వీసెస్ తరహాలో న్యాయమూర్తులను నియమించేందుకు ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్ (ఏఐజేఎస్) వంటి ఇతర సంస్కరణలు ప్రతిభకు భరోసా ఇవ్వగలవని ఆయన సూచించారు. నానాటికీ పెండింగ్‌లో ఉన్న కేసులను రాష్ట్రపతి ఎత్తి చూపారు. దేశంలో కొద్ది మంది మాత్రమే కోర్టులను ఆశ్రయించగలరని అన్నారు. దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఫిర్యాదుల పరిష్కారాన్ని కోరడం సగటు పౌరుడికి చాలా కష్టంగా మారిందని అన్నారు. కేసుల పెండింగ్‌ను క్లియర్ చేయడానికి న్యాయవ్యవస్థలో మార్పులను సూచించారు.
చట్టసభలు ఆమోదించే చట్టాల ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనాలు నిర్వహించడం లేదనీ, ఇది పెద్ద సమస్యలకు దారి తీస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టులను వాణిజ్య న్యాయస్థానాలుగా మార్చడం వల్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించలేమని పేర్కొన్నారు. న్యాయశాఖ ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీజేఐ కోరారు.
ప్రాథమిక హక్కులు తెలియదు...
విధులు మాత్రమే తెలుసు : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల మధ్య సమతుల్యతను నెలకొల్పితేనే దేశం గొప్పగా అవతరించగలదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ''ఒక దేశంగా మనం ఎంత అభివృద్ధి చెందామో మనం విశ్లేషించుకోవాలి. నేను ఒక గ్రామం నుంచి వచ్చాను. నేను ఎంపీ అయిన తరువాత మాత్రమే గ్రామాన్ని రోడ్లకు అనుసంధానించగలిగాను. నాకు ప్రాథమిక హక్కుల గురించి తెలియదు, కానీ ప్రాథమిక విధులు మాత్రమే తెలుసు. సరిహద్దులో ఒక సైనికుడు ప్రాథమిక విధులు గురించి ఆలోచిస్తాడు. ప్రాథమిక హక్కులు కాదు. నేను నగరాలకు వచ్చినప్పుడు, నేను ప్రాథమిక హక్కుల గురించి ఆలోచిస్తాను'' అని అన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మధ్యవర్తిత్వం కోసం స్వతంత్ర చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి తదుపరి తరం మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇది ''సుస్థిర న్యాయం అందించడంలోనూ, కేసు భారాన్ని తగ్గించడంలోనూ సహాయపడవచ్చు'' అని మంత్రి తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లు కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు లాంటిదేనని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును అమలు చేయలేని పరిస్థితి ఉంటే అది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
మార్స్‌లోకి ప్రయాణిస్తున్నాం.. కానీ న్యాయ వ్యవస్థ అలానే ఉంది : జస్టిస్ ఎఎం ఖన్విల్కర్
స్వాతంత్రం వచ్చిన తరువాత నేడు అంగారక గ్రహం (మార్స్)లోకి ప్రయాణిస్తున్నామనీ, కానీ న్యాయ వ్యవస్థ మాత్రం అలానే మిగిలిపోయిందని జస్టిస్ ఖన్విల్కర్ వ్యాఖ్యానించారు. న్యాయ భావనను వేద కాలంలో గుర్తించామనీ, ఆ కాలంలో హేతుబద్ధమైన నియమాలు, తర్కం, మెటాఫిజిక్స్ ఉన్నాయని అన్నారు. మన సుసంపన్నమైన న్యాయ వ్యవస్థను పున్ణపరిశీలించాలనీ, స్వదేశీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డివై చండ్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.