Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానుండగా.. ఆ రోజు పార్లమెంట్‌కు రైతులు చేపట్టే ట్రాక్టర్స్ మార్చ్‌ను తాత్కాలికంగా నిలివేస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేత దర్శన్ పాల్ వెల్లడించారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎస్కేఎం రాసిన లేఖపై ప్రభుత్వ స్పందన కోసం డిసెంబర్ 3 వరకు వేచి చూస్తామనీ, ఎటువంటి సమాధానంరాని పక్షంలో డిసెంబర్ 4న ఎస్కేఎం సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు. సింఘూ సరిహద్దువద్ద ఎస్కేఎం సమావేశం శనివారం జరిగింది. అనంతరం సమావేశ నిర్ణయాలను దర్శన్ పాల్ తదితరులు మీడియాకు తెలిపారు. ఈ నెల 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎస్కేఎం లేఖ రాసిందనీ, దానిపై ఇప్పటివరకూ ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని ఎస్కేఎం తప్పుపట్టింది. చర్చల ప్రక్రియను పున్ణప్రారంభించాలనీ, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై చర్చించాలని కోరారు. ద్వైపాక్షిక చర్చలను దాటవేసి, కీలకమైన అంశాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎస్కేఎం ఖండించిందని ఆయన అన్నారు. ''ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే రైతులను సంప్రదించి, వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ఎన్నికైన ప్రభుత్వ విధి'' అని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి ప్రధాన మంత్రి ప్రకటన, చట్టాల రద్దు ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదం, బిల్లును తొలిరోజే 29న లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ, నవంబర్ 29 నుంచి షెడ్యూల్ చేయబడిన ట్రాక్టర్ మార్చ్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
సి2+50 శాతం ఫార్ములా ఆధారంగా అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఎంఎస్పీ చట్టపరమైన హామీ, విద్యుత్ సవరణ బిల్లు-2020, 2021 ముసాయిదా ఉపసంహరణ, ''కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జయినింగ్ ఏరియా యాక్ట్-2021''లో రైతులపై విధించిన శిక్షాపరమైన నిబంధనల తొలగింపు, ఉద్యమ సమయంలో రైతులపై బనాయించిన తప్పుడు కేసుల ఉపసంహరణ, కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా తొలగింపు, అరెస్టు, రైతు ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం, పునరావాసం, సింఘూ సరిహద్దు వద్ద వారి జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించేందుకు భూమిని కేటాయించడం వంటి ఆరు డిమాండ్లను ప్రధాన మంత్రికి రాసిన లేఖలో లేవనెత్తిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చర్చల ప్రక్రియను పున్ణప్రారంభించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 4న జరగనున్న ఎస్కేఎం తదుపరి సమావేశంలో పార్లమెంటు కార్యకలాపాలతో సహా తదుపరి పరిణామాలను పరిగణలోకి తీసుకుంటుందని, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
నేడు ముంబాయిలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్
మహారాష్ట్రలోని ముంబాయిలో ఆజాద్ మైదాన్‌లో నేడు (ఆదివారం) భారీ కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ జరగనున్నది. సంయుక్త షెత్కారీ కమ్గర్ మోర్చా ఆధ్వర్యంలో 100కి పైగా సంఘాలు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ ఎస్కేఎం నాయకులు పాల్గొంటారు. మహాపంచాయత్‌లో మహారాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొంటారు.