Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతస్థాయి సమీక్షలో ప్రధాని మోడీ
- కరోనా, వ్యాక్సిన్ పరిస్థితులపై సమీక్ష
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం శనివారం నాడిక్కడ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా నేపథ్యంలో ప్రజారోగ్య సంసిద్ధత, వ్యాక్సిన్ సంబంధిత పరిస్థితిని సమీక్షించారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు, కేసులపై ప్రపంచ పోకడల గురించి ప్రధాని మోడీ వివరించారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలు అనేక కోవిడ్-19 ఉప్పెనలను ఎదుర్కొన్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్-19 కేసులు, టెస్ట్ పాజిటివిటీ రేట్లకు సంబంధించిన జాతీయ పరిస్థితిని కూడా ప్రధాని సమీక్షించారు. వ్యాక్సినేషన్లో పురోగతి, 'హర్ ఘర్ దస్తక్' కార్యక్రమం కింద జరుగుతున్న ప్రయత్నాల గురించి ప్రధాని వివరించారు. రెండవ డోస్ కవరేజీని పెంచాల్సిన అవసరం ఉందని, మొదటి డోస్ పొందిన వారందరికీ సకాలంలో రెండవ డోస్ ఇచ్చేలా చూసుకోవాల్సిన ఆవశ్యకతపై రాష్ట్రాలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ ఆదేశించారు. కొత్త వేరియంట్ ఆఫ్ కన్సర్న్ 'ఓమిక్రాన్' లక్షణాలు, వివిధ దేశాల్లో కనిపిస్తున్న ప్రభావం గురించి ప్రధాని మోడీకి అధికారులు వివరించారు. భారత్‌పై దీని ప్రభావం గురించి కూడా చర్చించారు. కొత్త ముప్పు దృష్ట్యా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కు, భౌతిక దూరం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రమాదానికి గురైన దేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, మార్గదర్శకాల ప్రకారం వారి పరీక్షలు, విదేశాల నుంచి వచ్చిన వారందరినీ పర్యవేక్షించవలసిన అవసరాన్ని ప్రధాని మోడీ వివరించారు. అభివృద్ధి చెందుతున్న కొత్త వేరియంట్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణ పరిమితుల సడలింపు కోసం ప్రణాళికలను సమీక్షించవలసిందిగా కూడా అధికారులను ప్రధాని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ నమూనాలను సేకరించాలనీ, ఐఎన్ఎస్ఏసీఓజీ కింద ఇప్పటికే ఏర్పాటుచేసిన ల్యాబ్‌ల నెట్వర్క్, కోవిడ్-19 నిర్వహణ కోసం గుర్తించిన ముందస్తు హెచ్చరిక సిగల్ ద్వారా పరీక్షించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సరైన అవగాహన ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అధిక కేసులు నమోదయ్యే క్లస్టర్లలో ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా కొనసాగించాలని, ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించాలని ఆయన ఆదేశించారు. కొత్త ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు తాము సులభతర విధానాన్ని అనుసరిస్తున్నామని ప్రధానికి అధికారులు వివరించారు. వివిధ ఔషధాల బఫర్ స్టాక్‌లు తగినన్ని ఉండేలా రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. పీడియాట్రిక్ సౌకర్యాలతో సహా వైద్య మౌలిక సదుపాయాల పనితీరును సమీక్షించడానికి రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కార్యదర్శి రాజీవ్ గౌబా, నిటి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డా. వి.కె పాల్, కేంద్ర హౌం శాఖ కార్యదర్శి అజరు కుమార్ భల్లా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శులు (ఫార్మాస్యూటికల్స్) రాజేష్ భూషణ్, (బయోటెక్నాలజీ) డాక్టర్ రాజేష్ గోఖలే, ఐసిఎంఆర్ డిజి బలరామ్ భార్గవ, ఆయూష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, ఎన్హెచ్ఏసీఈఓ ఆర్ఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్. కె. విజరు రాఘవన్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.