Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పీకి చట్టబద్ధతపై ఆర్థిక నిపుణులు
- రైతుల డిమాండ్లు నెరవేర్చాలి
- దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది..
- 1960లో ఎంఎస్పీ తీసుకొచ్చారు..ప్రజల ఆకలి సమస్యను తీర్చింది..
- కొనుగోలు కోసం ప్రభుత్వం చేసేది ఖర్చు కాదు
- అది పెట్టుబడి..కోట్లాది కుటుంబాలు లాభపడతాయి
న్యూఢిల్లీ : యావత్తు రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి రైతాంగం బయటపడాలంటే, వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే రైతు డిమాండ్లని పాలకులు నెరవేర్చాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత..వంటి కీలకమైన ఆరు డిమాండ్లను నెరవేర్చే వరకూ నిరసనలు ఆపమని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. మూడు సాగు చట్టాల రద్దుపై ప్రధాని మోడీ ప్రకటనను స్వాగతిస్తూనే, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరుతున్నారు. దీనిపై సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రధాని మోడీకి లేఖ కూడా రాసింది. ఈ ఒక్క ప్రకటనతో రైతు సమస్యలు పరిష్కారం కావని ఎస్కేఎం తెలిపింది.
ఖర్చు కాదు..ప్రభుత్వ పెట్టుబడి : సుఖపాల్ సింగ్, ఆర్థికవేత్త
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే..పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయించాల్సి వస్తుందని ఒక వాదన ఉంది. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లోనూ ఇది ప్రస్తావనకు వచ్చినట్టు మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత తీసుకొస్తే, 23 పంట ఉత్పత్తుల సేకరణకు కేంద్రం దాదాపు రూ.17లక్షల కోట్లు ఖర్చ చేయాల్సి వస్తుందని, అప్పుడు దేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిధుల వ్యయం చేసే పరిస్థితి ఉండదని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రమూ వాస్తవం లేదని పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ ఆర్థికవేత్త సుఖ్పాల్ సింగ్ చెబుతున్నారు. 23 పంటల్లో ప్రతి గింజనూ ఎంఎస్పీ వద్ద కేంద్రం కొనుగోలు చేసినా..వ్యయం రూ.9లక్షల కోట్లు దాటదని ఆయన చెబుతున్నారు.
ఇక్కడ గ్రహించాల్సిన మరొక విషయముందని సుఖ్పాల్ సింగ్ అంటున్నారు. అదేంటంటే..''గోధుమ, వరి..ఏదైనా మొత్తం పంట అంతా మార్కెట్కు రావటం లేదు. గోధుమలో 74శాతమే మార్కెట్లోకి వస్తోంది. అలాగే వరి పంటలో 90శాతం మార్కెట్కు వస్తోంది. ధాన్యం, పప్పు దినుసులు, నూనె గింజెలు, పత్తి, పసుపు, మిరప..ఇలా ఇతర పంటల్ని చూసుకున్నా ఇంతే. రైతు పండించిన దంతా మార్కెట్కు రాదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.7లక్షల కోట్లు దాటదు. కోట్లాది కుటుంబాలు ఆధారపడిన వ్యవసాయంపై పెట్టిన ఈ ఖర్చు (రూ.7లక్షల కోట్లు) వృధా కాదు. ప్రభుత్వ పెట్టుబడిగా మారి..దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్నో రెట్లు పెంచుతుంది'' అని చెప్పారు.
హరిత విప్లవానికి కారణం ఎంఎస్పీ : ఆర్థికవేత్త లఖ్వీందర్ సింగ్,
నేడు వ్యవసాయరంగాన్ని చుట్టుముట్టిన ప్రధాన సమస్య 'ఎంఎస్పీ'. పంట ఉత్పత్తులకు మార్కెట్లో న్యాయమైన ధర దక్కాలంటే ఎంఎస్పీకి చట్టబద్ధత ఉండాలని ఎంతో మంది నిపుణులు, స్వామినాథన్ కమిషన్ సూచించింది. దేశంలో ఆహార కొరత ఏర్పడకుండా వరి, గోధుమ పంటలను ప్రోత్సహించడానికి 1960లో ఆనాటి పాలకులు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎంఎస్పీని తీసుకొచ్చారు. దేశంలో హరిత విప్లవానికి ఇదే నాంది పలికింది. ఆహార కొరతను, తద్వారా ప్రజల ఆకలి సమస్యను తీర్చింది. ప్రస్తుతం 23 పంట ఉత్పత్తులకు కేంద్రం ఎంఎస్పీ ప్రకటిస్తోంది. అయితే మార్కెట్ మోసాలు రైతులకు ఎంఎస్పీ ధర దక్కకుండా చేస్తున్నాయి. ఎంఎస్పీ ప్రకటించీ లాభం లేకుండాపోతోంది. దాంతో ..ఎంఎస్పీకీ చట్టబద్ధత ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.