Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షల సంఖ్య పెంచండి : కేంద్రం ఆదేశం
- అంతర్జాతీయ విమానాలపై సమీక్ష
- పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు చర్యలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌లో వెలుగులోకి వచ్చిన కొత్తవేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివారం పలు సూచనలు చేసింది. కొత్త వేరియంట్ ప్రయాదకరంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని పేర్కొంది. దీనిలో భాగంగా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని, ఆ మేరకు మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. విదేశాలనుండి ముఖ్యంగా రిస్క్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొంది. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఐసోలేషన్ చేయడంతో పాటు, జినోమ్కోడ్ను నిర్ధారించాలని, ఒమిక్రాన్‌గా తేలితే పకడ్బందీగా కాంట్రాక్టు ట్రేసింగ్ చేసి అందరినీ ఐసోలేట్ చేసి, వైద్య సేవలు అందించాలని సూచించింది. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చూపకూడదని ఆదేశించింది. హోంశాఖ ఆదివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్దరించాలన్న నిర్ణయంపై సమీక్ష తరువాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విమానాలను డిసెంబర్ 15 నుండి పూర్తిస్థాయిలో అనుమతించాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్త పరిస్తితిని మరోసారి సమీక్షించాలని , ఆ తరువాతే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలు ఒమిక్రాన్ వ్యాప్తి అవకాశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించాయి. బెంగళూరుకు దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటవ్ రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్నిచర్యలపై దృష్టిసారించింది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు జినోమ్ కోడ్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. అవసరమైతే మరోసారి అంక్షలను విధించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. సోమవారం నుండే కొన్ని పాక్షిక ఆంక్షలు అమలులోకి రానున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మాల్స్,సినిమాహాళ్లు తదితర ప్రాంతాల్లో ఆంక్షలను పునరుద్దరించే అంశాన్ని పరిశీలిస్తోంది. విమానాశ్రయాల వద్ద పూర్తిస్థాయిలో నిఘా పెట్టడంతో పాటు, పరీక్షలను విస్తృతం చేయాలని నిర్ధారించింది.