Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్ష రద్దు, 23 మంది అరెస్టు
లక్నో : షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన ఉత్తరప్రదేశ్ టీచర్ ఎలిజిబిటీ టెస్టు (యూపీటెట్) పేపర్ లీక్కావడంతో రద్దయింది. ఈ విషయాన్ని పరీక్ష ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందు రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. ఈ పరీక్షకు 19.99 లక్షల మందికి పైగా అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. ప్రభుత్వం ప్రకటించే సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సాంకేతిక, ఇతర ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి రాష్ట్రంలో వివిధ నగరాల్లో శనివారం రాత్రి 23 మందిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసిందని ప్రశాంత్ కుమార్ చెప్పారు. లక్నోలో నలుగురిని, ప్రయాగ్‌రాజ్‌లో 13 మందిని, మీరట్‌లో ముగ్గురిని, కౌశంబి జిల్లాలో ఒకరిని అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ప్రశ్నాపత్రం ఫోటోకాపీ, ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నాపత్రంతో సరిపోయి ఉన్నట్లు ప్రశాంత్ కుమార్ తెలిపారు. పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుందని, నెల రోజుల్లో పరీక్ష మళ్లీ నిర్వహిస్తుందని చెప్పారు. 'పరీక్షకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్ష ఫారమ్ నింపాల్సిన అవసరం కూడా లేదు. అదే విధంగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా అభ్యర్థులను వారి సంబంధిత గమ్యస్థానాలకు యూపీఎస్ఆర్టీసీ బస్సులతో ఉచితంగా పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది' అని చెప్పారు. ఈ కేసును రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణ చేస్తుందని, పేపర్ లీక్‌కు బాధ్యులైన వ్యక్తులు, సంస్థలను వదలి పెట్టబోమని ప్రశాంత్ కుమార్ తెలిపారు.