Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్తహీనత, చిన్నారుల్లో పెరుగుదల లోపాన్ని తగ్గించే విషయంపై గ్లోబల్ న్యూట్రీషన్ రిపోర్ట్
- ఎనిమియాతో బాధపడుతున్న మహిళలు 53 శాతం మంది
న్యూఢిల్లీ : భారత్లో ఇటీవల కాలంలో రక్తహీనత, చిన్నారుల్లో పెరుగుదల లోపంను తగ్గించే విషయంలో పురోగతి లేదు. ఈ విషయాన్ని గ్లోబల్ న్యూట్రీషన్ రిపోర్ట్-2021 (జీఎన్ఆర్, 2021) వెల్లడించింది. ఈ నివేదికను ఇటీవలే విడుదల చేశారు. నివేదికలో నమోదు చేయబడిన 161 దేశాలలో భారత్ ఎలాంటి పురోగతి సాధించలేదనీ, ముఖ్యంగా మహిళల్లో రక్తహీనతను తగ్గించడంలో అధ్వాన్నంగా ఉన్నదని వివరించింది.
కుంగుబాటు లోపంతో 34శాతం..
బక్కచిక్కి 17 శాతం మంది
ఈ నివేదిక ప్రకారం.. మహిళల్లో రక్తహీనతను తగ్గించే లక్ష్యాన్ని సాధించే వైపు భారత్ ఎలాంటి పురోగతినీ సాధించలేదు. భారత్లో ప్రస్తుతం 53 శాతం మంది మహిళలు (15-49 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు) ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య 2016లో 52.6 శాతంగా ఉండగా, అది 2020 నాటికి 53 శాతానికి పెరిగింది. ఇక తక్కువ బరువుతో జన్మించే శిశువుల విషయంలో భారత్ సాధించిన పురోగతిపై అంచనా వేయడానికి తగినంత లేదా సంబంధిత సమాచారం లేకపోవడం గమనార్హం. ఇక 0-5 నెలల శిశువుల్లో 58శాతం మంది తల్లి పాలను పొందుతున్నారు. ఎదుగుదల లోపం (కుంగుబాటు)తో బాధపడుతున్న చిన్నారులు (ఐదేండ్లలోపు వారు) ఇప్పటికీ 34.7 శాతం మంది ఉన్నారు. అయితే, ఇది ఆసియా (21.8 శాతం) సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండటం ఆందోళనకరం. అలాగే, 17.3 శాతం మంది చిన్నారులు బక్కచిక్కి ఉన్నారు. ఈ విషయంలోనూ ఆసియా సగటు(8.9శాతం)కంటే భారత్లోనే అధికంగా ఉండటం గమనార్హం.అలాగే, 1.6 శాతం మంది చిన్నారులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల లోపం (కుంగుబాటు)తో బాధపడుతున్న చిన్నారులు(ఐదేండ్లలోపువారు)14.92 కోట్ల మందిగా ఉన్నారు.4.54 కోట్ల మంది సరైన తిండి దొరకక బక్కచిక్కిన శరీరాలతో బాధలను అనుభవిస్తున్నారు. 3.89 కోట్ల మంది అధిక బరువు సమస్యను కలిగి ఉన్నారు. ఇక 40 శాతానికి పైగా అంటే 220 కోట్ల మంది మహిళలు, పురుషులు అత్యధిక బరువు(ఒబెసిటీ)తో బాధపడుతున్నారు.అయితే,ఈ సమస్యల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్న దేశాలు కొన్ని మాత్రమే ఉండటం గమనార్హం. ఇక రక్త హీనత స్థాయిలను తగ్గించే విషయంలో 161 దేశాలలో ఏ దేశమూ ఆశించినంతగా పురోగతిని చూపకపోవడం ఆందోళనకరం.