Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 23 వరకు దాదాపు 20 రోజుల పాటు సభా కార్యకలాపాలు జరిగే ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు లోక్‌సభలో రైతు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో ఆమోదం కోసం 37 బిల్లులను ప్రభుత్వం జాబితా చేసింది. అందులో ఇటీవలి తెచ్చిన మూడు ఆర్డినెన్స్‌లు కూడా ఉన్నాయి. విద్యుత్ సవరణ బిల్లు, బ్యాంకుల ప్రయివేటీకరణ బిల్లు వంటి బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ఆమోదం కోసం మోడీ సర్కార్ ప్రయత్నిస్తుంది. మరోవైపు నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ధరలు పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అయ్యాయి. అలాగే లఖింపూర్ ఖేరీ ఘటనలో రైతులు మరణానికి కారణం అయిన కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా సస్పెండ్ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా లేవనెత్తనున్నాయి. కరోనా మృతులకు పరిహారంపై కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్షాలు సిద్ధం అయ్యాయి. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండలని ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా వ్యూహ రచన చేస్తుంది. అందులో భాగంగానే సోమవారం ఎన్డీఏ పక్షాల సమావేశం, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది.పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు ఆదివారం లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీడియాపై ఆంక్షలు సరికాదని అధిర్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా మీడియా ఉందని, అలాంటి మీడియాను పార్లమెంటులోకి అనుమతించకపోవడం బాధాకరమని చెప్పారు. కోవిడ్-19 కారణంగా ఏడాదిన్నరగా మీడియాను పార్లమెంట్‌లోకి అనుమతించలేదని, ప్రస్తుతం మాల్స్, రెస్టారెంట్స్, సినిమా హాళ్లు, మార్కెట్లు సహా అన్ని చోట్లా కోవిడ్ నిబంధనలు తొలగించారని గుర్తు చేశారు. కేవలం పార్లమెంటులో మీడియాపై మాత్రమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. మీడియా నిఘా లేకుండా చేయడం ప్రజాస్వామ్యంలో ఆందోళనకర పరిణామమని, మీడియా కవరేజీపై విధించిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్ గ్యాలరీ పాసులను పునరుద్ధరించడంతో పాటు మీడియా కవరేజీకి తగిన సదుపాయాలు కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.