Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో సిజేరియన్ సెక్షన్ (సీ-సెక్షన్) డెలివరీలు పెరుగుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తాజా సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం..ప్రయివేటు ఆస్పత్రుల్లో పెరుగుతున్న వైద్య సౌకర్యాలతో దేశవ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్లలో పెరుగుదల కనిపిస్తున్నది.ఫలితంగా దేశవ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్లు 40.9శాతం నుంచి 47.4శాతానికి పెరిగాయి.ఇక వైద్యసదుపాయం కోసం ప్రయివేటు లేదా ప్రభుత్వాస్పత్రికి వెళ్లే ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి సీ-సెక్షన్ ఆపరేషన్ జరగటం గమనార్హం. కాగా,డబ్ల్యూహెచ్ఓ సమాచారం ప్రకారం..సిజేరియన్ విషయంలో ఆదర్శ రేటు 5శాతం నుంచి 15శాతం మధ్య ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రతి పది డెలివరీలలో ఏడు నుంచి ఎనిమిది వరకు సీ-సెక్షన్ ద్వారానే కావటం గమనించాల్సిన అంశం. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ (82.7 శాతం), జమ్మూ కాశ్మీర్ (82.1శాతం),తమిళనాడు(81.5శాతం),అండమాన్ నికోబార్ (79.2 శాతం),అసోం(70.6శాతం)లు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో సిజేరియన్ ఆపరేషన్లు భారీగా పెరిగాయి. అసోంలో 17.3 శాతం పాయింట్లు పెరిగి 70.6శాతానికి చేరింది. ఇక ఒడిశాలో 17శాతం పాయింట్లు పెరిగి 70.7శాతం, పంజాబ్లో 15.8శాతం పాయింట్లు పెరిగి 55.5శాతం, తమిళనాడులో 12.5శాతం పాయింట్లు పెరిగి 63.8శాతం కర్నాటక లో12.2శాతం పాయింట్లు పెరిగి 52.5శాతంగా నమోదయ్యా యి.దేశవ్యాప్తంగా దాదాపు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇలాంటి పెరుగుదలలు ఉన్నాయి.ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రసవాలు పెరిగాయి. 2014-15లో 52.1 శాతంగా ఉన్న సంస్థాగత ప్రసవాలు 2019-20లో 61.9శాతానికి పెరగడం దీనికి కారణం కావచ్చు.ఇక దేశవ్యాప్తంగా ప్రజారోగ్య సౌకర్యాల రేట్లు 11.9శాతం నుంచి 14.3శాతానికి పెరిగాయి. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ పెరుగుదల 17.2 శాతం నుంచి 21.5 శాతానికి చేరటం గమనార్హం.