Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగిలిన డిమాండ్లను సాధించేదాకా పిడికిలి బిగిద్దామంటూ ప్రతిజ్ఞ
- ముంబయిలో భారీ కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్
- హాజరైన పలువురు ఎస్కేఎం నేతలు
దాదర్ : తమ డిమాండ్ల పరిష్కరించేదాకా..మోడీ సర్కార్‌పై పోరాడుదామని కిసాన్ మహా పంచాయత్ ప్రతిజ్ఞ చేసింది.మహారాష్ట్రలోని ముంబయిలో ఆదివారం ఆజాద్ మైదాన్‌లో భారీ కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ జరిగింది. చారిత్రాత్మక రైతుల విజయాన్ని కొనియాడింది. మిగిలిన డిమాండ్ల కోసం మడమతిప్పకుండా ఉద్యమం కొనసాగించాల్సిన అవసరమున్నదని స్పష్టం చేసింది. సంయుక్త షెత్కారీ కామ్‌గర్ మోర్చా ఆధ్వర్యంలో 100కి పైగా సంఘాలు నిర్వహించి ఈ మహాపంచాయత్‌లో 50 వేల మంది హాజరయ్యారు. మహారాష్ట్రలోని నలుమూలల నుంచి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అన్ని మతాలు, కులాలనే తేడా లేకుండా పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో ఏడాది పాటు సాగిన రైతుల పోరాటంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వంపై చారిత్రాత్మక విజయాన్ని సంబరాలు చేసుకుంది. మిగిలిన డిమాండ్ల కోసం పోరాడాలనే తన సంకల్పాన్ని కూడా ప్రకటించింది. వచ్చే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, మహారాష్ట్రలో జరగనున్న రాష్ట్రవ్యాప్త స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించాలని మహాపంచాయత్ పిలుపునిచ్చింది. తొలుత లఖింపూర్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించింది. అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి పురస్కరించుకొని ఆయనను స్మరించుకుంది. ఈ మహా పంచాయత్‌లో ఎస్కేఎం నాయకులు హన్నన్ మొల్లా, రాకేశ్ తికాయత్, డాక్టర్ దర్శన్ పాల్, యుధ్వీర్ సింగ్, తాజిందర్ సింగ్ విర్క్, అతుల్ కుమార్ అంజాన్, రాజారామ్ సింగ్, యోగేంద్ర యాదవ్, జస్బీర్ కౌర్ నాట్, ఆశిష్ మిట్టల్, అశోక్ ధావలే, బి. వెంకట్, మేధా పాట్కర్, జయంత్ పాటిల్, ప్రతిభా షిండే, నరసయ్య ఆడమ్, జెపి గావిట్, డాక్టర్ అజిత్ నవాలే తదితర రైతు, కార్మిక నేతలు ప్రసంగించారు. ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీని తొలగించడం, అరెస్టు చేయడం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకో వడం వంటి రైతు ఉద్యమ డిమాండ్లను లేవనెత్తారు. అలాగే నాలుగు లేబర్ కోడ్ల రద్దు,డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్ ధరలను సగానికి తగ్గించడం, జాతీయ వనరుల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని, పని దినాలు, వేతనాలు రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు.అక్టోబరు 27న పూణెలో ప్రారంభమైన లఖింపూర్ ఖేరీ అమరవీరుల షహీద్ కలశ్ యాత్ర గత నెల రోజులుగా మహారాష్ట్రలోని 30జిల్లాల్లో పర్యటించి, షహీద్ బాబు స్మారక స్థూపం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చైత్య భూమి అయిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని సందర్శించింది.నవంబర్ 27న జెను,మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించింది.ఆదివారం ఉదయం షహీద్ కలశ్ యాత్ర 1950వ దశకంలో సంయుక్త మహారాష్ట్ర పోరాటంలో 106మంది అమరవీరుల స్మారకార్థం హుటాత్మా చౌక్‌ను సందర్శించింది.అమరవీరుల చితాభస్మాన్ని గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి అరేబియా సముద్రంలో సాయంత్రం 4గంటలకు ప్రత్యేక కార్యక్రమంలో నిమజ్జనం చేశారు.
కార్పొరేట్లను తరిమికొట్టాలని మహార్యాలీ
కార్పొరేట్లను తరిమికొట్టండి...దేశాన్ని రక్షించండి...పంజాబ్‌ను రక్షించండి అంటూ లూథియానాలో సేవ్ పంజాబ్ యునైటెడ్ ఫ్రంట్ మహా ర్యాలీ నిర్వహించింది.రైతుల పోరాటానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద నిరసన జరిగింది.అమెరికాలోని విన్నిపెగ్‌లోని మానిటోబాలో నిరసన ప్రదర్శన జరిగింది.నిరసన తెలుపుతున్న భారతీయ రైతులకు ఇటాలియన్, ఫ్రెంచ్ రైతు సంఘాలు తమ సంఘీభావం తెలిపాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఆందోళన జరిగింది.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు
రైతులు ఆందోళన చేయడం అర్థం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎస్కేఎం పేర్కొంది. కమిటీ ఏర్పాటుతో ఎంఎస్పీపై రైతుల డిమాండ్ నెరవేరిందని అనడం సరికాదని ఎస్కేఎం విమర్శించింది. పంటలు కాల్చుతున్న రైతులపై జరిమానాలు విధించమని కేంద్రం పేర్కొందని కేంద్ర మంత్రి అనడం దారుణమని, జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసిదని ఎస్కేఎం తెలిపింది. అలాగే నేటీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం జాబితా చేసిన విద్యుత్ సవరణల బిల్లుపై వ్యవసాయ మంత్రి మౌనంగా ఉన్నారని పేర్కొంది. ముఖ్యంగా, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, ఉద్యమ అమరవీరులకు పరిహారం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలని, ఈ అంశాలపై తాము నిర్ణయం తీసుకుంటామని తోమర్ చెప్పారు. ఈ రెండు విషయాలపై పంజాబ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కాబట్టి, బీజేపీ పాలనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. అజరు మిశ్రా టెని అరెస్టు, తొలగింపు, లఖింపూర్ ఖేరీ ఊచకోత సంబంధిత డిమాండ్‌పై కూడా మంత్రి మౌనంగా ఉన్నారు. మంత్రిని మోడీ ప్రభుత్వం అనైతికంగా రక్షించడాన్ని ఎస్కేఎం మరోసారి ఖండించింది. గత 12 నెలలుగా రైతు ఆందోళనల్లో 686 మంది రైతులు తమ ప్రాణాలను అర్పించారు. గత ఏడాది కాలంలో 48,000 మంది రైతులు అనేక పోలీసు కేసుల్లో చిక్కుకున్నారని హర్యానా రైతు నాయకులు అంచనా వేస్తున్నారు. అనేక మంది రాజద్రోహం, హత్యాయత్నం, అల్లర్లు మొదలైన తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ పోరాటంలో భాగంగానే ఉత్తరప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రైతులపై కేసులు పెట్టారు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన ప్రభుత్వం ఇప్పటివరకు నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి తీసుకురావాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రైతులతో చర్చలను పునఃప్రారంభిం చకుండా, అప్రజాస్వా మిక,ఏకపక్ష మార్గాల్లోరైతుల నిరసనలను ముగిం చాలని కేంద్ర ప్రభుత్వం అనడం దారుణమని ఎస్కేఎం పేర్కొంది.
మహత్తర పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాలు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, స్వాతంత్రోద్యమాల స్ఫూర్తితో దేశంలో మరిన్న ఉద్యమాలు చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ చెప్పారు. నియంతృత్వ పోకడలు, నిరంకుశ పాలకులను ఎదుర్కోవడం కొత్తకాదనీ, వారిని ఎదురొడ్డి పోరాడిన ఘనత దేశ ప్రజలకుందని చెబుతూ పలు పోరాటాలను వివరించారు. రైతాంగ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తామని చెప్పారు. మోడీ విధానాలను ఓడిస్తామన్నారు.