Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష సమావేశానికి మోడీ గైర్హాజరు
- 31 పార్టీల నుంచి 42 మంది సభ్యులు హాజరు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాని మోడీ డుమ్మా కొట్టారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. దానికి ప్రధాని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, రాజ్యసభ అధికార పక్షనేతతో అన్ని పార్టీల నేతలు హాజరవుతారు. ఇది సాంప్రదాయంగా సాగుతుంది. గత ఏడేండ్లలో ప్రతి అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యేవారు. కానీ ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరయ్యారు. ఏడేండ్లలో తొలిసారి మోడీ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవటం గమనార్హం. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తాము ప్రధాని మోడీ సమావేశానికి హాజరవుతారని ఆశించామనీ, ఆయనతో తాము కొన్ని అంశాలు చర్చించాలని అనుకున్నామన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే సంప్రదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారని పేర్కొన్నారు. ''ఈసారి ఆయన హాజరు కాలేదు'' చెప్పారు. అయితే నవంబర్ 26న జరిగే రాజ్యాంగ దినోత్సవానికి ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం వల్ల, ప్రధాని మోడీ అఖిలపక్షానికి హాజరుకాలేదని సమాచారం. కేంద్ర ప్రభుత్వాన్ని సమావేశంలో వివిధ పార్టీ నేతలు ప్రశ్నిస్తే, విదేశీ ప్రతినిధులతో ఉన్నారని ప్రభుత్వం తెలిపినట్టు ఒక పార్టీ నేత తెలిపారు. సమావేశంలో ప్రధాని మోడీ లేరనే అంశాన్ని వామపక్ష పార్టీలు లేవనెత్తాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమావేశాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవుతుండేవారని వివరించాయి.
సహకరించండి... రాజ్‌నాథ్ సింగ్,
కేంద్ర రక్షణ మంత్రి
ఆదివారం ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో 31 పార్టీల నుంచి 42 మంది సభ్యులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు వివిధ అంశాలను లేవనెత్తాయి. పార్లమెంట్ సమావేశాల తొలి రోజైన సోమవారం వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రతిపక్షాలు, అధికార బీజేపీకి అనుకూలమైన పార్టీలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధమైన మద్దతును కోరాయి. ఆందోళన చేస్తున్న రైతులు లేవనెత్తిన డిమాండ్లను కూడా ప్రస్తావించాయి. అలాగే పెగాసస్ స్పైవేర్‌పై చర్చకు పట్టుపట్టాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాలంటూ పలు పార్టీలు తమ డిమాండ్లను పునరుద్ఘాటించాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి బిల్లును ఆమోదించాలని ఈ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడు ఉపసంహరణ ఆపాలని కోరాయి. స్టాండింగ్ కమిటీలో బిల్లులు చర్చకు రావడం లేదని పలువురు నేతలు సూచించడంతో, సవివరమైన చర్చ కోసం బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పార్లమెంట్లో చర్చలు ఆరోగ్యకరంగా జరిగేలా సభను సజావుగా నిర్వహించేలా సభ్యులు చూడాలని రాజ్‌నాథ్ సింగ్ అన్ని పార్టీల నేతలను కోరారు.
రైతుల సమస్యలపై సవివరమైన చర్చః
ఖర్గే, కాంగ్రెస్ నేత
రైతుల సమస్యలపై సవివరమైన చర్చ అవసరం. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, లఖింపూర్ ఖేరీ హింస, బొగ్గు కొరత, త్రిపురలో హింస, కోవిడ్-19 వంటి అనేక అంశాలపై చర్చ జరగాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఎలా ప్రవర్తించిందో ... బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి.
ఆర్థికవిధానాలపై చర్చ ఏదీ..?
పార్లమెంట్లో ఆర్థిక విధానంపై చర్చించడంలో కేంద్రం విముఖత చూపుతోందని టీఎంసీకి చెందిన సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కి చెందిన ఫరూక్ అబ్దుల్లా వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందున ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ఇప్పుడు ఆర్టికల్ 370 (ప్రత్యేక హౌదా)ని పునరుద్ధరిస్తుందని ఆశించారు. ఎంపీల్యాడ్స్ నిధులను రూ.20 కోట్లకు పెంచాలని, ప్రయివేట్ రంగంలో ఎస్సీ,ఎస్టీల కోటాకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలని ఎన్డీఏలోని బీజేపీ మిత్రపక్షం రాందాస్ అథ్వాలే డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ప్రసన్న ఆచార్య మాట్లాడుతూ మీకు నిర్మాణాత్మక మద్దతును అందిస్తామని, పార్లమెంటును నిర్వహించే ప్రాథమిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దయచేసి కనీసం వాటిని వినండని, చట్టాలపై అర్థవంతమైన చర్చలు, తగిన చర్చల కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆప్ ఎంపీ సంజరు సింగ్ మాట్లాడుతూ ''ప్రభుత్వం రైతులను దెబ్బతీయాలని రైతు వ్యతిరేక విద్యుత్తు సవరణ బిల్లు తెస్తున్నారు. ఎంఎస్పీ హామీ బిల్లును జాబితాలో చేర్చలేదు. పంజాబ్‌లో 50 కిలో మీటర్ల మేర బీఎస్ఎఫ్ విస్తరించింది. అజరు మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాను. ప్రహ్లాద్ జోషి నన్ను సమావేశంలో మాట్లాడకుండా అడ్డుకున్నారు. నేను సమావేశాన్ని బహిష్కరించాను'' అని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ (బీజేపీ), అనుప్రియా పటేల్ (అప్నాదళ్), పసుపతి పాశ్వాన్ (ఎల్జేపీ) పాల్గొన్నారు. అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ (కాంగ్రెస్), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), సుదీప్ బందోపాధ్యా య, డెరిక్ ఒబ్రియిన్ (టీఎంసీ), శరద్ పవర్ (ఎన్సీపీ), వినాయక్ రౌత్ (శివసేన), రామ్‌గోపాల్ యాదవ్ (ఎస్పీ), సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ), ప్రసన్న ఆచార్య (బీజేడీ),ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫెరెన్స్), నామా నాగేశ్వర రావు, బండా ప్రకాశ్ (టీఆర్ఎస్), తదితరులు పాల్గొన్నారు.