Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు కార్మికుల మృతి
విశాఖపట్నం :ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో రసాయన వ్యర్థాలు విడుదల చేసే పంప్ హౌస్ వాల్వ్ నుంచి విషవాయువు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తోటి కార్మికుల కథనం ప్రకారం... రాంకీకి చెందిన ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ఫార్మా కంపెనీల నుంచి రసాయనాలు వచ్చే పంప్‌హౌస్ వద్ద పాయకరావుపేటకు చెందిన మణికంఠ (22), తుని దగ్గర్లోని సీతారామపురానికి చెందిన దుర్గాప్రసాద్ (21) పని చేస్తున్నారు. వీరు పంప్ హౌస్ వాల్వ్ తిప్పుతుండగా విషవాయువు లీకవడంతో మణికంఠ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని సెక్యూర్టీ గార్డుకు చెప్పి ఆయనను రక్షించే ప్రయత్నంలో దుర్గాప్రసాద్ కూడా మృతి చెందినట్లు తెలిసింది. పరవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
27 లక్షల చొప్పున పరిహారం
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని,ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ బాధిత కుటుంబాలతో కలిసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సోమవారం సంఘటన స్థలం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో జరిగిన చర్చల్లో మృతుల కుటుంబాలకు రూ.27 లక్షల చొప్పున పరిహారం, దహనసంస్కారం నిమిత్తం రూ.50 వేల చొప్పున ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.