Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులదురహంకార హత్యలపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయినా కులతత్వం నిర్మూలన కాలేదని భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశంలో కులం పేరిట జరుగుతున్న హింసాత్మక ఘటనలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపింది.కులం పేరుతో జరిగే ''ఘోరమైన నేరాల''పై పౌర సమాజం''తీవ్ర నిరాకరణ''తో స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వివరించింది.1991లో యూపీలో కుల దురహంకార హత్య కేసులో దాఖలైన ఒక బ్యాచ్ పిటిషన్లపై తీర్పును వెలువరిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. కులదురహంకార హత్యల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ యంత్రాంగాలకు తాము గతంలోనే అనేక ఆదేశాలు జారీ చేశామని కోర్టు వివరించింది. తదుపరి ఎలాంటి జాప్యం లేకుండా ఈ ఆదేశాలను అమలు చేయాలని తెలిపింది. విచారణలు కలుషితమవు తున్నాయనీ, ''సత్యం ప్రాణాపాయంగా మారడాన్ని'' నివారించడానికి సాక్షులను రక్షించడంలో రాష్ట్రానికి కచ్చితమైన పాత్ర ఉన్నదని న్యాయమూర్తి ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలోని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవారు లతో కూడిన ధర్మాసనం వివరించింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా కోర్టులో సాక్ష్యం చెప్పే హక్కు ''ఈ రోజు తీవ్రమైన దాడిలో ఉన్నది'' అని తెలిపింది. కాగా, ఈ కేసులో 23 మందిని దోషులుగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. గుర్తింపులో అస్పష్టత కారణంగా ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది.