Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ విస్టా పనులపై
- వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : జాతీయ రాజధాని పరిధిలో వున్న ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలపై నిషేధమున్నా సెంట్రల్ విస్టా పనులు కొనసాగడంపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. తీవ్రమైన వాయు కాలుష్యపు ఉక్కు పిడికిలి నుంచి ఢిల్లీ నగరాన్ని విడిపించేందుకు భవన నిర్మాణ కార్యకలాపాలపై సుప్రీం ఈ నెల 24న తిరిగి నిషేధం విధించింది. అయినా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు శరవేగంతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం, కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే డిసెంబరు 2వ తేదీకల్లా దీనిపై వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఆదేశించింది. 'నిషేధం వున్నా పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ సెంట్రల్ విస్టా కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ సెంట్రల్ విస్టా పనులపైనే ఎందుకు దృష్టి పెడుతున్నారు, ఇందులో పిటిషనర్ ప్రయోజనాలేమిటని ప్రశ్నించారు. ''కోర్టు దృష్టి పెట్టేది ప్రధానంగా కాలుష్యం పైనే, ఈ విషయంలో కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఎవరినీ వదిలేది లేదు'', అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేంద్ర వాయు కాలుష్య కమిషన్ ఆదేశాలను రాష్ట్రాలు పూర్తిగా అమలు చేస్తున్నాయా లేదా అని పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు కోర్టు తెలిపింది. రాష్ట్రాలు చర్య తీసుకోలేకపోతే స్వతంత్ర టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సి వస్తుందని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.