Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి ప్రతిపాదన లేదు : ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : వర్చూవల్ కరెన్సీ వినియోగ దారులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది ప్రభుత్వం చేయడం లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పష్టం చేశారు. అదే విధంగా బిట్‌కాయిన్ లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరించామన్న రిపోర్టులు వాస్తవం కాదన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్బంగా లోక్‌సభలో సభ్యులు సుమలతా అంబరీష్, డికె సురేశ్ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ బిట్ కాయిన్ ఒక డిజిటల్ కరెన్సీ అని చెప్పారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు, థర్డ్ పార్టీల భాగస్వామ్యం లేకుండా వస్తువులు, సేవల కొనుగోలుకు, నగదు బదిలీకి బిట్ కాయిన్ వాడుతున్నారని తెలిపారు.
త్వరలో దేశీయ డిజిటల్ కరెన్సీ...
దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగానికి సంబంధించి ఆర్బిఐ పలు అంశాలను అధ్యాయనం చేస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. డిజిటల్ కరెన్సీని కూడా గుర్తించేలా బ్యాంక్ నోటు నిర్వచన పరిధిని విస్తరించాలని ఆర్బిఐ అక్టోబర్‌లో ప్రతిపాదనలు చేసిందన్నారు. ఈ మేరకు ఆర్బిఐ 1934 చట్టంలో సవరణలు చేయాలని సూచించిందన్నారు. క్రిప్టో కరెన్సీ నిషేధం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబిడిసి) వంటి అంశాలపై విపక్ష సభ్యులు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు పంకజ్ చౌదరీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఎలాంటి అంతరాయం లేకుండా సిబిడిసిని ప్రవేశపెట్టడానికి దశల వారి వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిబిడిసితో నగదుపై ఆధారపడటం తగ్గుతుందని.. అనేక ప్రయోజనాలున్నాయన్నారు. డిజిటల్ కరెన్సీతో కచ్చితమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన, నియంత్రిత, చట్టపరమైన చెల్లింపులకు అవకాశం ఉంటుందన్నారు. నియంత్రించలేని క్రిప్టోకరెన్సీల వల్ల దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురి కావొచ్చని మంత్రి చౌదరీ పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021ను ఈ సమావేశాల్లోనే చర్చకు రానుందని తెలుస్తోంది. ప్రయివేటు క్రిప్టో కరెన్సీల నిషేధంతో పాటు దేశీయ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ బిల్లును తెస్తున్నారని సమాచారం. దీంతో ప్రయివేటు క్రిప్టోకరెన్సీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకొనే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది.