Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 శాతం ప్రాణాంతక ప్రమాదాలు ఇలాంటివే..
- ఇంజినీరింగ్ లోపాలు, నిద్ర, అలసటే ప్రధాన కారణాలు: హైవే ఆడిట్
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రమాద మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఆడిట్ ప్రకారం.. 40 శాతం ప్రాణాంతక ప్రమాదాలు వెనుక నుంచి వాహనాలు ఢ కొనడం వల్లే జరుగుతున్నాయి. నిద్ర, అలసటలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అలాగే, రోడ్లపై అనేక ఇంజినీరింగ్ లోపాలను సైతం ఈ ఆడిట్ గుర్తించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని నాలుగు రహదారులపై పైలట్ ఆడిట్.. మొత్తం 557 కిలోమీటర్ల వన్‌వేపై అక్కడక్కడ ఖాళీలు, రోడ్డు సరిగా లేకపోవడం, బారియర్లు, రోడ్డు వెంబడి ఉంచిన కాంక్రీట్ నిర్మాణాలు వంటి అనేక ఇంజినీరింగ్ లోపాలను గుర్తించింది. దీని ఫలితంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇలాంటి లోపాలు ఆగ్రా-ఇటావా స్ట్రెచ్‌లో 7,500 లోపాలు గుర్తించబడ్డాయి. ఇటావా-చకేరి, పూణే-సతారా, సతారా-కాగల్ కారిడార్‌లోనూ లోపాలు గుర్తించబడ్డాయి. ఆయా స్ట్రెచ్‌లలో గత మూడేండ్లలో 6,500 ప్రమాదాలు జరగ్గా.. వాటిలో 1600 ప్రమాదాల్లో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదాలన్ని కూడా ముందు వెళ్తున్న, ఆగివున్న వాహనాలను వెనుక నుంచి ఢ కొనడం వల్ల జరిగినవి. ముఖ్యంగా వాణిజ్య వాహనాల డ్రైవర్లు నిద్ర, అలసట కారణంగా వాహనాలను వెనుక నుంచి ఢ కొట్టడానికి దారి తీసింది. అలాగే, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా నడపడం వంటి సాధారణ లోపాలే కాకుండా కొన్ని ప్రాంతాల్లో సరైన వెలుతురు లేకపోవడం, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ఉదాహరణకు యూపీలోని రహదారులపై శీతాకాలంలో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆగ్రా-ఇటావా కారిడార్‌లో దాదాపు 39 శాతం మరణాలు, 32 శాతం ప్రమాదాలు పొగమంచు ఉన్న పరిస్థితుల్లో జరిగాయి. మహారాష్ట్రలో వర్షాకాలంలో ''హైడ్రోప్లానింగ్'' సమస్య ఏర్పడి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక అంబులెన్సులు సైతం ప్రమాద ప్రాంతాలకు దగ్గరలేని కారణంగా కూడా ప్రాణనష్టం పెరిగినట్టు ఆడిట్లో గుర్తించారు.
ఇక ఈ నాలుగు స్ట్రెచ్ల ఆడిట్ ఫలితాలు, సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.