Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ల విషయంలో మేధో సంపత్తి హక్కులను ఒదులుకోవడానికి నిరాకరణ
- సంపన్న దేశాలపై యూఎన్కు 28 దేశాల నర్సుల యూనియన్ల ఫిర్యాదు
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ల విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ), యునైటెడ్ కింగ్డమ్ (యూకే), నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్ వంటి దేశాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని 28 దేశాలకు చెందిన నర్సులు, ఆరోగ్య కార్యకర్తల యూనియన్లు ఆరోపించాయి. తమ దేశాల్లో దాదాపు 25 లక్షల మందికి ఈ యూనియన్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లను వేగంగా అందించేందుకు మేధో సంపత్తి హక్కులను తాత్కాలికంగా ఒదులుకోవడం విషయంలో నిరాకరించిన ఈ దేశాలపై ఈ యూనియన్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్)కి ఫిర్యాదు చేశాయి. మహమ్మారి కాలంలో కోల్పోయిన ''లెక్కలేనన్ని జీవితాలకు'' ఈయూతో పాటు ఈ నాలుగు దేశాలే కారణమని నర్సుల యూనియన్ల కూటమి ఆరోపించింది. వాణిజ్య సంబంధిత మేధో సంపత్తి హక్కులు (ట్రిప్స్ ఒప్పందం)పై డబ్ల్యూటీఓ ఒప్పందం కింద హక్కుల మాఫీకి వారి '' నిరంతర వ్యతిరేకతే'' దీనికి కారణమని యూనియన్లు ఆరోపించాయి. జెనీవాలో 30న కీలక డబ్ల్యూటీఓ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరుగనున్న సందర్భంలో ఈ ఫిర్యాదు రావడం గమనార్హం. అయితే, 'ఒమిక్రాన్ వేరియంట్' తీవ్రత నేపథ్యంలో ఈ సమావేశం వాయిదాపడింది. కాగా, తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీ వేగాన్ని పెంచే ఉద్దేశంలో భాగంగా మేధో సంపత్తి హక్కులు ఒదులుకునే ప్రతిపాదనను డబ్ల్యూటీఓ లో భారత్, దక్షిణాఫ్రికాలు గతేడాది తీసుకొచ్చిన విషయం విదితమే. కాగా, ప్రపంచ జనాభాలో 45 శాతం మందికి పైగా ఇప్పటికీ మొదటి డోసు వ్యాక్సిన్ను పొందలేదని గ్లోబల్ నర్సెస్ యునైటెడ్ (జీఎన్యూ), ప్రోగ్రెస్సివ్ ఇంటర్నేషనల్ (పీఐ) లు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.