Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం ఇటీవల సాగించిన పోరాటం విజయం సాధించినప్పటికీ వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ భవిష్యత్‌లో పోరు కొనసాగుతుందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్ష కార్యదర్శులు అశోక్ ధావలె, హన్నన్ మొల్లా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలను వారు నిష్పాక్షికంగా విశ్లేషించారు. బిల్లు లక్ష్యాలను, వాస్తవిక వ్యవసాయ పరిస్థితులతో పోల్చి చూసినట్లైతే ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ అని స్పష్టమవుతోందన్నా రు. యూపీ,ఉత్తరాఖండ్‌లతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోరైతాంగాన్ని ఆకట్టుకునే ప్రయత్నమే ఇదని తెలిపారు.ఈ బిల్లు లక్ష్యం ప్రజల ను తప్పుదారి పట్టించేలా వుందని, మూడు వ్యవసా య చట్టాల్లోని కార్పొరేట్ అనుకూల పక్షపాతాన్ని కప్పిపుచ్చేలా వుందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లు లక్ష్యాలను, వాస్తవిక పరిస్థితులతో పోలుస్తూ, వారు సవివరమైన విశ్లేషణ జరిపారు. ప్రోత్సాహక ధరలు లభించేలా,ఎక్కడైనా ఏ కొనుగోలుదారుడికైనా తమ ఉత్పత్తులను విక్రయిం చుకోగలిగేందుకు రైతులకు స్వేచ్ఛ కల్పించామని బిల్లు పేర్కొంటోంది. ఈ నిబంధన ఎలా ప్రోత్సాహక ధరలకు హామీ కల్పిస్తోందో అర్ధం కావడం లేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటున 6శాతం మంది రైతులే కనీస మద్దతు ధర పొందుతున్నారు. అది కూడా ప్రభుత్వ సేకరణ యంత్రాంగం ద్వారా. మిగిలిన రైతాంగమంతా పెద్ద ఎత్తున నష్టాలకు, ప్రయివేట్ మార్కెట్లో దోపిడీకి గురవుతున్నారు. తమకు దరిదాపుల్లో ప్రభుత్వ సేకరణ వ్యవస్థ, ప్రభుత్వ మార్కెట్ లేని నేపథ్యంలో చిన్న, ఒక మోస్తరు రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వం చెప్పినట్లుగా ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళ్లడానికి రవాణా, నిల్వ సదుపాయాల ఖర్చును భరించేగలిగే స్థితిలో వున్నారా? ఇలాంటివా రే దేశంలో 85శాతానికి పైగా వున్నారని ఆ ప్రకటన పేర్కొంది.ప్రాసెసర్, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారు,సంఘటిత రిటైలర్లు, ఎగుమతిదారులు, ఇటువంటి వారు రైతులతో నేరుగా చర్చలు జరిపేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని బిల్లు పేర్కొంటోంది.కానీ ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న ఏమిటంటే, ఎవరి కోసం వీరు ఇలా చేస్తున్నారు? - రైతుల ప్రయోజనాల కోసమా లేదా కార్పొరేట్ సంస్థల కోసమా? సిటు ప్లస్ 50శాతం కలిపిన కనీస మద్దతు ధర కన్నా తక్కువగా రైతులకు ప్రోత్సాహక ధర లభించదని స్పష్టం చేస్తూ బిల్లులో ఏ క్లాజులు లేవు. కాంట్రాక్ట్ వ్యవసాయ వ్యవస్థను బలవంతంగా అమల్లోకి తీసుకువచ్చేలా ప్రతిపాదిత వ్యవస్థ వుంటుంది.ఈ కాంట్రాక్ట్ ఇచ్చేది కార్పొరేట్ కంపెనీలే నని ఏఐకేఎస్ ప్రకటన పేర్కొంది. పారదర్శకతను మెరుగుపరిచేందుకు, ధరల అన్వేషణకు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని బిల్లు పేర్కొంటోంది. కానీ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అనేది కూడా సాంకేతికపరమైన పురోగతే,అది ఏ రకంగా నూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరం లేదు. రైతుల ప్రయోజనాలు నెరవేర్చే వాల్యూ చెయిన్ ఏర్పాటుకు ఎలాంటి నిర్దిష్టమైన క్లాజులు లేవు. ప్రాసెసింగ్ తర్వాత మిగిలినదాంట్లో హేతుబద్ధమైన వాటా వచ్చేలా హామీ లేదని ప్రకటన పేర్కొంది. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు వ్యవసాయ కాంట్రాక్టులకు చట్టబద్ధమైన వ్యవస్థను అందచేశామని బిల్లు పేర్కొంటోంది. వారిని ఆర్థికంగా సాధికారులను చేయడానికి, వారి ఉత్పత్తులకు ముందుగానే ధర వచ్చేలా హామీ కల్పించడానికి ఈ వ్యవస్థ వెసులుబాటు ఇస్తుందని బిల్లు పేర్కొంటోంది. సబ్సిడీ, కనీస మద్దతు ధర కన్నా తగ్గని రీతిలో ప్రోత్సాహక ధరలు వంటి చర్యలు తీసుకోకుండా వ్యవసాయ చట్టం రైతులకు ఆర్థికంగా ఎలాంటి సాధికారత కల్పించలేదని పేర్కొంది.