Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ చొరబడిందా? లేదా? అన్నది తెలుసుకుంటాం. హ్యాకింగ్ ఆనవాళ్లను గుర్తిస్తాం. మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్స్ మాకు ఇవ్వండి..అని సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పిటిషనర్లను కోరింది. ఈ కేసులో ఫోన్ హ్యాకింగ్, నిఘా సాఫ్ట్వేర్..వంటి సాంకేతిక అంశాల్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పిటిషన్‌దార్లకు ప్యానెల్ ఈమెయల్ ద్వారా లేఖ రాసింది. వారి వ్యక్తిగత ఫోన్లు ప్యానెల్‌కు అందజేయాల్సి వుంటుందని, సాంకేతికంగా వీటిని పరిక్షిస్తామని లేఖలో పేర్కొన్నది. పిటిషన్‌దార్లు తమ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు న్యూఢిల్లీలో ఎక్కడ ఇవ్వాలనేది త్వరలో తెలుపుతామని, ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ సమక్షంలో ప్రమాణం చేస్తూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు సమర్పించవచ్చునని లేఖలో తెలిపారు.పెగాసస్ కేసులో సాంకేతిక అంశాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో నవీన్ కుమార్ చౌదరీ, ప్రొఫెసర్ అశ్విన్ అనిల్ గుమాస్తే, ప్రొఫెసర్ ప్రబాహరన్ పూర్ణచంద్రన్లతో ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటైంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలు, కేంద్ర మంత్రివర్గంలోనివారిపైనా, ఉన్నతాధికారులపైనా మోడీ సర్కార్ పెగాసస్ స్పైవేర్‌తో అక్రమ నిఘా కార్యకలాపాలు చేపట్టిందని అంతర్జాతీయ మీడియా సంస్థల పరిశోధన్మాతక జర్నలిజం బయటపెట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణోవ్పైనా నిఘా పెట్టారని తేలింది. దేశ రాజకీయాల్ని కుదిపేసిన ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.