Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో పౌరసమాజంపై ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మరికొంత మంది ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హక్కుల కార్యకర్తల్ని, పౌర సంఘాల్ని దేశ విద్రోహులుగా కేంద్రం చిత్రీకరించటాన్ని మాజీ సివిల్ సర్వెంట్స్ తీవ్రంగా ఖండించారు. అత్యంత చెడు సంప్రదాయానికి, ప్రమాదకర ధోరణికి మోడీ సర్కార్ తెరలేపిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై దేశ ప్రజలకు రాసిన లేఖలో 102మంది మాజీ సివిల్ సర్వెంట్స్ సంతకాలు చేశారు. 'కానిస్టిట్యూషనల్ కాండాక్ట్ గ్రూప్'లో సభ్యులుగా ఉన్న పలువురు ప్రముఖ మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్...తదితర క్యాడర్ ఉద్యోగులు ఈ లేఖలో మోడీ సర్కార్ తీరును తప్పుబట్టారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యల్ని మాజీ సివిల్ సర్వెంట్స్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మానవ హక్కుల్లో భారతదేశ స్థాయి దారుణంగా దెబ్బతిన్నదని జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్న సంగతిని బహిరంగ లేఖలో ప్రస్తావించారు. లేఖలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.ఆల్ ఇండియా స్థాయిలో సివిల్ సర్వెంట్స్గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశామని, రిటైర్ అయ్యాక తామంతా 'కానిస్టిట్యూషన్ కాండాక్ట్ గ్రూప్'(సీసీజీ)గా ఏర్పాటయ్యామని లేఖలో తెలిపారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, అయితే దేశ రాజ్యాంగం పట్ల నిబద్ధతతో ఉన్నామని 'సీసీజీ' పేర్కొన్నది. మోడీ సర్కార్ పాలనా తీరుపై సీసీజీ ఆందోళన వ్యక్తం చేసింది. హిందూత్వవాదంతో పలు రాష్ట్రాల్లో లౌకకవాదంపై, మానవహక్కులపై దాడులు జరుగుతున్నాయని తెలిపింది. ''దీనిని ప్రశ్నిస్తున్న పౌర సమాజాన్ని, పౌర హక్కుల నేతల్ని కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. వారిని దేశద్రోహులుగా చిత్రీకరించి అరెస్టు చేస్తున్నారు. జాతి వ్యతిరేకులుగా, విదేశీ ఏజెంట్లుగా ముద్రవేస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమైన''దని 'సీసీజీ' ఆందోళన వ్యక్తం చేసింది.