Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏడాదిగా రైతులతో ఆటలాడుకున్న మోడీ ప్రభుత్వం..ఎట్టకేలకు మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎలాంటి చర్చ లేకుండానే కేవలం మూజువాణి ఓటుతోనే బిల్లును వెనక్కి తీసుకున్నది. బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షం పట్టుపట్టినా కేంద్రం సమ్మతించలేదు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అనుమతితో బిల్లుపై చర్చకు అనుమతించకుండా మోడీ ప్రభుత్వం మమ అనిపించింది. బిల్లుపై చర్చ జరిగితే, కనీస మద్దతు ధర వంటి అనేక రైతు సమస్యలు ప్రతిపక్షాలు లేవనెత్తుతాయనీ, అందుకే చర్చకు అనుమతించలేదని ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కుతూ నేటీకి వాయిదా పడ్డాయి. సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.సోమవారం లోక్‌సభ ప్రారంభమైంది. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన వారితో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీలు ప్రతిభా సింగ్, జ్ఞానేశ్వర్ పాటిల్ లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. సభలో ప్రతిపక్ష సభ్యులు వివిధ అంశాలపై ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి వివిధ అంశాలను లేవనెత్తారు. దీంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్ అనుమతించలేదు. తరువాత ప్రతిపక్షాలు వివిధ ప్రజా సమస్యలు, రైతు సమస్యలుపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా స్పీకర్ ఓంబిర్లా తిరస్కరించారు. అనంతరం మూజువాణి ఓటుతో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే, బిల్లుకు ఆమోదం తెలిపిన తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తర చేస్తున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగకుండా ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టాయి. ఈ అంశంలో ప్రతిపక్షాలకు కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే ఇప్పటికే ఈ చట్టాలపై మోడీ క్షమాపణ చెప్పడంతో ప్రభుత్వం ఈ బిల్లుపై చర్చకు సుముఖంగా లేదు. ఈ క్రమంలో ప్రతిపక్షాల డిమాండ్ల మధ్యే బిల్లుకు ఆమోదం పొందింది. వారి ఆందోళనలతో కార్యకలాపాలకు ఆటంకం వాటిల్లిందని స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై చర్చ తప్పనిసరేనని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే తంతు సాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు ఇటీవలే నియమితులైన సెక్రెటరీ జనరల్ పీసీ మోడీని సభకు పరిచయం చేశారు. అనంతరం మహారాష్ట్ర నుంచి రజని అశోక్‌రావు పాటిల్, తమిళనాడు నుంచి మహ్మద్ అబ్దుల్లా, కె.ఆర్.ఎన్ రాజేశ్ కుమార్, కనిమొళి ఎన్విఎన్ సోము, పశ్చిమ బెంగాల్ నుంచి లూజీనో ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్‌తో పాటు పలువురు మాజీ ఎంపీల మృతికి సంతాపంగా రాజ్యసభను చైర్మెన్ గంటపాటు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దీనిపై చర్చ జరగాలని రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు రాజ్యసభ చైర్మెన్ అనుమతించలేదు. అనంతరం మూజువాణి పద్ధతిలో వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ మూడు రద్దు బిల్లులను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలపై 15 నెలల తర్వాతైనా ప్రభుత్వం మేల్కోవడం సంతోషకరమన్నారు. అయితే, వీటిపై చర్చ జరపాలని చైర్మెన్‌కు విజ్ఞప్తి చేసినా..పరిగణనలోకి తీసుకోలేదు.
ఫలవంతంగా సాగాలిః ప్రధాని మోడీ
ఈ సమావేశాలు ఫలవంతంగా సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తు న్నారన్నారు. ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నది. అర్థవంతమైన చర్చల ద్వారా పార్లమెంటు హుందా తనాన్ని నిలబెడదాం.కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
రైతు సమస్యలపై చర్చించాలి
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఆందోళన
నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. రైతు సమస్యలపై కేంద్రం చర్చించాలి. ''వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనీ గతంలోనే చెప్పాం.ఇపుడు ఈ చట్టాలు రద్దయ్యాయి. వ్యవసాయ చట్టాలపై చర్చించకుండానే రద్దు చేయడం విచారకరం. చర్చకు మోడీ ప్రభుత్వం భయపడుతోంది''.