Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఎరువుల కోసం రైతన్నలు ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. వాటిని పొందేందుకు అనేక తిప్పలు పడుతున్నారు. ఎరువుల కొరత, పెరుగుతున్న ధరలు అన్నదాతలను సంకట స్థితిలోకి నెట్టాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వారు ఎరువుల కోసం బ్లాక్ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ ఏజెంట్లు అధిక ధరలతో అన్నదాతల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఎరువుల కొరతను తీర్చి వాటిని తక్కువ ధరలకు రైతులకు అందించాల్సిన కేంద్రం మాత్రం ఆ వైపుగా ఆలోచించడం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. భారత్‌లో వ్యవసాయం పైనే ఆధారపడి లక్షలాది కుటుంబాలున్నాయి. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఈ సీజన్లో వ్యవసాయ పనుల్లో ఇప్పటికే నిమగమయ్యారు. ఈ నేపథ్యంలో ఎరువుల కోసం బ్లాక్ మార్కెట్లను ఆశ్ర యించడం తప్ప తమకు మరో మార్గం కనబడటంలేదని రైతన్నలు వాపో యారు. '' ఎరువులను వాడకుండా తక్కువ దిగుడికి సిద్ధపడి సాహసమైనా చేయాలి. లేదా.. ఆకాశాన్నంటే ధరలున్న బ్లాక్ మార్కెట్నైనా ఆశ్రయించాలి'' అని మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ పాటిదార్ అనే రైతు తన ఆవేదనను తెలి పారు.
కాగా, పంటల దిగుబడి తగ్గితే దేశంలో ఆహార ధరలు పెరిగే అవకాశమున్నదనీ, ద్రవ్యోల్బణం సమస్య తలెత్తుతుందని నిపుణులు తెలిపారు. బ్లాక్ మార్కెట్లలో అధిక మొత్తం వెచ్చించి ఎరువులు కొనుగోలు చేయడం భారత్‌లో ఉన్న 80 శాతం మంది తక్కువ ఆదాయం కలిగిన రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని గ్రో ఇంటెలిజెన్స్ సమాచారం. '' బ్లాక్ మార్కెట్లో 45 కేజీల డీఏపీ బ్యాగు రూ. 1500 పలుకుతున్నది. ఇది ఎంఆర్పీ రూ. 1200 కంటే ఎక్కువ. అలాగే, ఒక బ్యాగు యూరియా ధర రూ. 400కు బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది. అయితే, సాధారణంగా దీని ధర రూ. 266 మాత్రమే'' అని దిలీప్ పాటీదార్ తెలిపారు. '' దేశంలో రైతులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడం ఆందోళనకరం. ఎరువుల సబ్సీడీని వేగవంతం చేసే అంశంపై ఆర్థిక శాఖ నుంచి కానీ, ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ నుంచి కానీ ఎలాంటి స్పష్టతా లేకపోవడం దారుణం'' అని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.