Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బీ.1.1.529) ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ కరోనా వేరియంట్ భారత్ కల్లోలం సృష్టించిన డెల్టా కన్నా ఆరు రెట్లు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ పెను విషాదాన్ని మిగిల్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో ఉన్న విపరీత మ్యుటేషన్లను నిర్వీర్యం చేయడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కానీ కాక్టెయిల్ ట్రీట్మెంట్ కూడా ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్వీర్యం చేయదని నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణ ద్వారా నిపుణులు ఈ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ కరోనా ఆర్ వాల్యూ ఆరు రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. రోగనిరోధక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుందనీ, ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని బలిగొన్న డెల్టా వేరియంట్.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి స్పందించింది. అయితే డెల్టా నుంచి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ మాత్రం మోనోక్లోనల్ థెరపీకి స్పందించలేదు.
నిజానికి మోనోక్లోనల్ చికిత్స ఓ అద్భుతమని మొదట్లో అనుకున్నారు. కానీ డెల్టా ప్లస్‌పై ఆ చికిత్స పనిచేయకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక ఒమిక్రాన్‌పై ఆ యాంటీబాడీ చికిత్స పనిచేయకపోవచ్చు అన్న సందేహాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్‌లో ఉన్న పలు స్పైక్ ప్రోటీన్లు మోనోక్లోనల్ యాంటీబాడీలను తట్టుకోగలవని ఐజీఐబీలో పనిచేస్తున్న రీసర్చ్ స్కాలర్ మెర్సీ రోఫినా తెలిపారు. కొత్తవేరియంట్లో మొత్తం 32 స్పైక్ ప్రోటీన్ వేరియంట్లు ఉన్నాయని చెప్పారు.