Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్
- పెద్దల సభలో తొలిసారి చోటు చేసుకున్న ఘటన
- గత సమావేశాల్లో ఘటనపై ఇప్పుడు చర్యలా..?
- రైతు,ప్రజా గొంతును నొక్కేందుకే ఈ నిర్ణయం
- భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. ప్రతిపక్ష ఎంపీలు
- ఎంపీలపై మోడీ ప్రభుత్వచర్యల్ని ఖండించిన 14 పార్టీలు
న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది ప్రతిపక్ష ఎంపీలపై మోడీ ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ కాంగ్రెస్, శివసేన, టీఎంసీ, సీపీఐ(ఎం), సీపీఐ ఎంపీలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున (ఆగస్టు 11న)సభలో గందరగోళం సృష్టించారని, నిబంధన 256 కింద శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకున్నది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ముజువాణి ఓటుతో తీర్మానం ఆమోదించినట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు.
రాజ్యసభలో తొలిసారి...
రాజ్యసభలో చరిత్రలోనే తొలిసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా.. ఏ సమావేశాల్లోనైనా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకుంటే..వారిని ఆ సమావేశాల్లోనే చర్యలు తీసుకోవడం, లేకపోతే కమిటీ వేసి, ఆ కమిటీ ప్రతిపాదన ప్రకారం చర్యలు తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది. కానీ అలా కాకుండా గత సమావేశాల్లోని ఘటనను సాకుగా చూపి ఈ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులపై వేటు వేయడం ఏన్నడూ జరగలేదు. కనీసం గత సమావేశాల్లో చివరి రోజు జరిగిన ఘటనపై కమిటీ కూడా వేయలేదు. కానీ గత సమావేశాల్లో చివరి రోజు జరిగిన ఘటనపై ఈ సమావేశాల్లో చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. 12 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామ్యమని ప్రతిపక్షాలు ఖండించాయి. ఈ మేరకు కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జేడీ, ఐయుఎంఎల్, ఎల్జేడీ, జేడీఎస్, ఎండీఎంకే, టీఆర్ఎస్, ఆప్ తదితర 14 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ''ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ఈ నిరంకుశ ప్రభుత్వం ఎంపీల్లో భయం పుట్టించేలా చేసింది. 12 మంది ఎంపీలపై చర్య కోసం తీర్మానం పూర్తిగా చట్టవిరుద్ధం. నిబంధనలకు విరుద్ధం. ఏ సెషన్లో జరిగిన సంఘటన ఆ సెషన్లోనే చర్యలు తీసుకోవాలి. కానీ ఈ సెషన్లో చర్య తీసుకోవడం దారుణం'' అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ''భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి మేం (ప్రతిపక్ష పార్టీల నాయకులు) సమావేశమవుతున్నాం. ప్రజా హక్కులను సర్కారుకు వినిపించేలా... వారి గొంతుకలుగా ఉన్న ప్రజాప్రతినిధులను అణచివేస్తే అది ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్టే. దీన్ని ఖండిస్తున్నాం. అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి'' అని ఖర్గే అన్నారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఎంపీల సస్పెండ్‌ను ఖండించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, సస్పెండ్‌ను వెంటనే ఎత్తివేయాలని డీఎంకే పార్టీ తరఫున తాను డిమాండ్ చేస్తున్నానని స్టాలిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రతీకార నిర్ణయంః రిపున్ బోరా, కాంగ్రెస్
మాపై ప్రతీకార నిర్ణయం తీసుకున్నారు. ''అవును, మేం గత సెషన్లో నిరసన తెలిపాం. మేం రైతులు, పేద ప్రజల సమస్యల కోసం నిరసనలు చేసాం. ఎంపీలుగా అణగారిన వర్గాల ప్రజల సమస్యలపై గొంతెత్తడం మా కర్తవ్యం. పార్లమెంట్లో గళం విప్పకపోతే ఎక్కడ చేస్తాం?'' అని అన్నారు. ''సస్పెండ్ పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని హత్య చేసినట్లే. మాకు గొంతె వినిపించే అవకాశం ఇవ్వలేదు. ఇది ఏకపక్ష, పక్షపాత, ప్రతీకార నిర్ణయం. ప్రతిపక్షాలను సంప్రదించలేదు''. ''ఈ సస్పెన్షన్ అన్యాయం. చైర్మెన్ నన్ను సస్పెండ్ చేశారో తెలియదు. నేను ఆ గొడవులో లేను. రాజ్యసభలో పూర్తి మెజారిటీని పొందేందుకే ఇలాంటివి. ప్రధాని మోడీ తన ఇష్టానుసారం చేస్తున్నారు'' .
మా గొంతు నొక్కేందుకేః ప్రియాంక చతుర్వేది, శివసేన
మా గొంతు నొక్కేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ''జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు, అక్కడ కూడా ఒక నిందితుడిని విచారిస్తారు. వారికి కూడా న్యాయవాదులు కేటాయిస్తారు. కొన్నిసార్లు వారి అభిప్రాయాలను తీసుకోవడానికి ప్రభుత్వ అధికారులను పంపుతారు. ఇక్కడ మా అభిప్రాయాలను తీసుకోలేదు. నేను చైర్మెన్‌తో మాట్లాడాను. కానీ ఫలితం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు'' . ''సీసీటీవీ ఫుటేజీని చూస్తే పురుష మార్షల్స్ మహిళా ఎంపీలను ఎలా దూషించారో రికార్డయింది. నిబంధనలు గురించి మాట్లాడుతున్నారు. ఏ నిబంధనలు. అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో బలమైన గళం, అభిప్రాయాలను వినిపించే వారి గొంతెలను నొక్కేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు''.
నియంతృత్వంలో భాగమే... డోలా సేన్, టీఎంసీ
ప్రభుత్వ నియంతృత్వంలో భాగంగానే సస్పెండ్ చేశారు. ''బీజేపీనేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం, నియంతత్వంతో ఉంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అపూర్వమైన దాడిని మేము ఖండిస్తున్నాం. రైతులకు, రాజ్యాంగానికి అనుకూలంగా పార్లమెంటులో మా గళాన్ని లేవనెత్తినందుకు సస్పెండ్ అయినందుకు గర్విస్తున్నాం''. ''ప్రజల కోసం పని చేస్తున్నాను. ఈ దేశం కోసం నిరసన తెలిపినందుకు మమ్మల్ని సస్పెండ్ చేశారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రజలు ఈ నియంతృత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు''.
పార్లమెంటా.. అపహాస్య ప్రాంతమా..?
బినరు విశ్వం, సీపీఐ
ప్రభుత్వం పార్లమెంటును అపహాస్యం చేసే ప్రాంతంగా రాజ్యసభను మార్చేసింది. ''చర్చలు లేవు, ప్రతిపక్షం మౌనంగా ఉండాలా? మాట్లాడితే నాతో సహా 12 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. అన్నదాతలు, డిఫెన్స్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగుల ఆందోళనలు ఉధృతం చేశాం. అది మన కర్తవ్యం. జనంతోనే ఉంటాం'' .