Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు
న్యూఢిల్లీ : కొత్తగా దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఆర్టిపిసిఆర్, రేపిడ్ యాంటిజెన్ (రాట్) పరీక్షల నుండి తప్పించుకోవడానికి వీల్లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. ఇందుకు గాను పరీక్షలను పెంచాలని రాష్ట్రాలను కోరింది. తద్వారా వెంటనే కేసులను గుర్తించడానికి వీలు వుంటుందని తెలిపింది. ప్రస్తుతం ముప్పును ఎదుర్కోని దేశాల నుండి వచ్చే ప్రయాణికులను కూడా పరీక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, మొత్తంగా పరీక్షల సంఖ్యను పెంచాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ సన్నద్ధతను సమీక్షించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వీడియో సమావేశాలు నిర్వహించారు. ఆ వెంటనే పై ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఒక్కటే కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య శాఖ ప్రకటన పేర్కొంది. మొదటి డోసు వందశాతమూ అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, రెండో డోసు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఇందుకోసం డిసెంబరు 31వరకు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారాన్ని విస్తరించాలని ఆ ప్రకటన కోరింది. వీటితో పాటు కోవిడ్ నిబంధనలు పూర్తిగా, కచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. అప్రమత్తత తగ్గించరాదని రాష్ట్రాలకు సూచనలు చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై కచ్చితమైన నిఘా వుండాలని, కేసులు పెరిగితే అవసరమైన సదుపాయాలు అందుబాటులో వుండేలా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని కోరింది.
భయం వద్దు : బైడెన్
ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన చెందే అంశమే కానీ తీవ్రంగా భయపడాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ఆయన, ఇతర వేరియంట్లను ఇప్పటివరకు ఎదుర్కొన్న రీతిలోనే కొత్త వేరియంట్‌ను కూడా అమెరికా ఎదుర్కొంటుందని చెప్పారు.
ఊహించిన దానికన్నా ముందే యూరప్‌లో ఒమిక్రాన్
ఒమిక్రాన్ వేరియంట్ ఊహించినదానికన్నా ముందే యూరప్‌లో ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. నవంబరు 19-23 మధ్య తీసుకున్న నమూనాల్లో రెండింటిలో ఇది బయటపడిందన్నారు. ఇది ఆఫ్రికాలో పర్యటించడం వల్ల వచ్చి ఉంటుందనేది ఇంకా నిర్ధారణ కాలేదు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డమ్‌కు విమానంలో వచ్చిన 61 మంది ప్రయాణీకులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 14 మందికి పాజిటివ్ అని తేలింది.