Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా నిబంధనలను సడలించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో భారత జీడీపీ 8.4 శాతం పెరిగింది. దీంతో కరోనా ముందు నాటి స్థాయికి వృద్థి రేటు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం ఏప్రిల్ - జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది 20.1 శాతం వృద్థి నమోదయ్యింది. కోవిడ్ కఠిన నిబంధనలతో గతేడాది జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 24.4 శాతం క్షీణించింది. 2020-21 సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతం పడిపోయింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో తమ అంచనాల కంటే జీడీపీ తక్కువగా నమోదయ్యిందని ఎలరా కాపిటల్ ప్రతినిధి గరిమా కపూర్ పేర్కొన్నారు. పారిశ్రామిక, తయారీ రంగాల రికవరీ నిరాశపర్చిందన్నారు. కాగా సర్వీసు సెక్టార్, ప్రయివేటు పెట్టుబడులు పెరిగాయన్నారు.
2021-22లో జిడిపి విలువ రూ.35,73,451 కోట్లుగా నమోదయ్యింది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.35,61,530 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాక్డౌన్ వల్ల జీడీపీ రూ.32,96,718 కోట్లకు క్షీణించింది. జాతీయ గణంకాల శాఖ (ఎన్ఎస్ఓ) ప్రకారం.. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో తయారీ రంగం 5.5 శాతం పెరిగింది. వ్యవసాయ రంగం 4.5 శాతం వృద్థి చెందింది. గతేడాది ఈ రంగం 3 శాతం మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో నిర్మాణ రంగం 7.2 ప్రతికూల వృద్థిని నమోదు చేయగా.. క్రితం క్యూ2లో 7.5 శాతం పెరిగింది. గనుల రంగం 15.4 శాతం పెరగ్గా.. గతేడాది 6.5 శాతం పడిపోయింది. విద్యుత్, గ్యాస్, నీరు, రవాణ, కమ్యూనికేషన్, సర్వీసెస్ రంగాలు 8.2 శాతం వృద్థిని సాధించాయి. విత్త, రియల్ ఎస్టేట్, ప్రొఫెషినల్ సర్వీసెస్ 7.8 శాతం పెరిగాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సర్వీసులు 17.4 శాతం వృద్థిని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇవి 9.1 శాతం మైనస్‌లో పడ్డాయి. కాగా.. పొరుగు దేశం చైనా సెప్టెంబర్ త్రైమాసికంలో 4.9 శాతం వృద్థిని సాధించింది.