Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన కూరగాయలు, మాంసం, దుస్తులు, ఆహార పదార్థాలు
- అనేక రంగాలపై పెట్రోల్, డీజిల్, రసాయనాల ధరల ప్రభావం
- ముడి పదార్థాల ధరల్ని, ద్రవ్యోల్బణాన్ని, తరుగును లెక్కచూసుకుంటున్న కంపెనీలు
- అన్నింటికీ సామాన్యుడి జేబు నుంచే వసూలు
ఏది కొనాలన్నా..ఏది తినాలన్నా..ధరల పోటు సామాన్యుడ్ని వేధిస్తున్నాయి. కొనకుండా ఉండలేని పరిస్థితి. మొత్తంగా సామాన్యుడికి జేబుకు చిల్లు. ప్రతి వస్తువు ధరా పెరిగింది. టీ పొడి, వంటనూనె, పప్పులు, మాంసం..ఆహార ఉత్పత్తులే కాదు, సబ్బులు, షాంపూల ధరలు పెరిగాయి. ఏడాది క్రితం బైక్ (ద్విచక్ర వాహనం) సర్వీసింగ్ బిల్లు రూ.650 దాటేది కాదు. ఇప్పుడు ఆటో మొబైల్ కంపెనీలు రూ.1350 వసూలు చేస్తున్నాయి. సరుకు రవాణా, ముడి పదార్థాల ధరలు పెరగటం, తరుగు, వడ్డీ భారం..ఇవన్నీ చూసుకొని పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు అమాంతం పెంచేశాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి.
న్యూఢిల్లీ : మనం తాగే టీ లేదా కాఫీ దగ్గర్నుంచీ ప్రతి వస్తువు, వస్తు సేవల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముడి పదార్థాల ధరలు, వడ్డీ, తరుగుకు తోడు ద్రవ్యోల్బణాన్ని లెక్కించాక, పెరిగిన సరుకు రవాణా ధరల్ని జోడించి కంపెనీలు తమ ఉత్పత్తలకు ధరల్ని నిర్ణయిస్తున్నాయి. మొత్తంగా సామాన్యుడి జేబు నుంచే లాక్కుంటున్నాయి. అది టీ పొడి, కాఫీ పొడి, బిస్కెట్లు, ఇంటికి వేసే సున్నం, రంగులు...ఇలా ఏదైనా కావొచ్చు. అన్నింటి ధరలూ విపరీతంగా పెరిగాయి. కిలో టమాటా ధర రూ.వంద దాటడం, కిలో కోడిమాంసం రూ.రెండొందలు దాటడం భారీగా పడిపోయిన మన రూపాయి (కరెన్సీ) విలువను తెలియజేస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిందని వారు అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే పలు ప్రయివేటు కంపెనీలు తమ వస్తువులు, సేవల ధరలు పెంచాయని నిపుణులు చెబుతున్నారు. మోడీ సర్కార్ వచ్చాక..పెట్రోల్‌పై కేంద్రం పన్ను 217శాతం, డీజిల్‌పై 607శాతం పెంచింది.
ద్రవ్యోల్బణం పతాకస్థాయికి..
కోవిడ్-19 సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా వర్తక వాణిజ్యం దెబ్బతిన్నది. దేశీయంగానూ లాక్డౌన్ అమలుకావటంతో సరుకు, వస్తు రవాణా దాదాపు స్తంభించిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంతగా పతనావస్థకు చేరుకుంది. దాదాపు 3.2కోట్లమంది మధ్య తరగతి ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు. నేడు దేశ ప్రజలంతా ధరలపోటును ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులు, వస్తువులు, ఆహార పదార్థాలు, ఇంధనం..ఇలా కీలకమైన వాటి ధరలన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకుంది. కూరగాయలు, మాంసం ధరలు...రూపాయి విలువ ఎంతగా పడిపోయిందో తెలుసుకోవడానికి ప్రధాన సూచనగా భావించొచ్చు. పెట్రోల్, డీజిల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా కూడా భారంగా మారింది. గత ఏడాదితో పోల్చితే వంట నూనె ధరలు 100శాతానికిపైగా పెరిగాయి.
ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు
ఉదాహరణకు..వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరగటంతో నగరాలు, పట్టణాల్లోని రెస్టారెంట్స్‌లో ధరలన్నీ పెరిగాయి. వాణిజ్య సిలిండర్‌పై వసూలు చేస్తున్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించాలని ఎంతోమంది కోరినా..కేంద్రం పట్టించుకోలేదు. వంటనూనె ధరలు, వాణిజ్య సిలిండర్ ధరల పెంపు పెద్ద పెద్ద ఆహార ఉత్పత్తుల తయారీ కంపెనీలపై ప్రభావం చూపింది. హైడ్ అండ్ సీక్, క్రాక్‌జాక్ బిస్కట్లను తయారుచేసే 'పార్లీ', గుడ్డే, టైగర్, మేరీ గోల్డ్ బిస్కట్లు తయారుచేసే 'బ్రిటానియా' కంపెనీలు..తమ ప్రోడక్ట్స్ ధరలు పెంచాల్సి వచ్చింది. ముడి పదార్థాల ధరలు, తయారీ ఖర్చు పెరగటమే కాదు, ద్రవ్యోల్బణమూ ఆహార ఉత్పత్తుల ధరలు పెరడానికి దారితీసింది. సబ్బులు, శాంపూలు..తదితర వ్యక్తిగత వస్తువుల ధరలు కూడా 60శాతానికిపైగా పెరిగాయి.
పెరగనున్న దుస్తుల ధరలు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంది. ముడి పత్తి, యార్న్ ధరలు భారీగా పెరిగాయని 'అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్' చైర్మెన్ ఎ.శక్తివేల్ అన్నారు. డయింగ్కు వాడే రసాయనాలు, వస్త్ర పరిశ్రమలో వాడే ఇతర రసాయనాల ధరలు పెరిగాయని ఆయన తెలిపారు. ఇది చాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వం దుస్తులపై జీఎస్టీని 5శాతం నుంచి 12శాతానికి పెంచటం..జనవరి 2022 నుంచి అమల్లోకి రాబోతున్నది. ఉక్కు, రబ్బరు, ముఖ్యమైన లోహాల ధరలు కూడా భారీగా పెరిగాయి. దాంతో ఆటోమొబైల్ రంగం కుదుపునకు లోనవుతోంది. రుణాలపై చెల్లించే వడ్డీలు, పన్నులు, వస్తు తయారీలో తరుగు..ఇదంతా చూసుకొని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల్ని భారీగా పెంచేశాయి. ఇవన్నీ కూడా వినియోగదారుడి జేబు నుంచే వసూలు చేస్తున్నాయి.