Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన చేసినవారిలో లేకపోయినా సస్పెండ్
- నాడు సభకు అంతరాయం కలిగించిన 33 మంది సభ్యుల జాబితాను విడుదల చేసిన రాజ్యసభ సచివాలయం
- అందులో ఎలమారం కరీం పేరు లేదు
న్యూఢిల్లీ : రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీంపై కక్ష సాధింపు చర్యలకు కేంద్రం దిగింది. గత సమావేశాల్లో ఆందోళన చేసిన వారి జాబితాలో ఆయన పేరు లేకపోయినా, సోమవారం సస్పెండ్ చేసిన 12 మంది జాబితాలో ఆయన పేరును చేర్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సమావేశాల్లో జరిగిన ఘటనపై ఈ సమావేశాల్లోని చర్యలు తీసుకోవడమే పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అప్పుడు ఆందోళన చేసిన వారి జాబితాలో పేరు లేని, ఎలమారం కరీంను సస్పెండ్ చేయడంతో మరింత విమర్శలు పెరిగాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేశారని, సభకు అంతరాయం కలిగించారని, సభ పట్ల అనుచితంగా ప్రవర్తించారని, శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం 12 మంది ప్రతిపక్షాలకు చెందిన ఎంపిలను సస్పెండ్ చేశారు. అయితే ఆగస్టు 11 (వర్షాకాల సమావేశాల చివరి రోజు)న రాజ్యసభ సచివాలయం ఆందోళన చేసి, సభా మర్యాదులు, నిబంధనలు పాటించని 33 మంది సభ్యుల జాబితాను బులెటిన్లో విడుదల చేశారు. ఆ జాబితాలో ఎలమారం కరీం పేరు లేదు. రూల్ 256 ప్రకారం ఆ సభ్యుడిని సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని తీసుకొచ్చే ముందు చైర్మన్ చేత ఆ సభ్యుని పేరు పొందుపరచాలి. ఇది కక్షసాధింపు చర్యేనని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. దీనిపై కరీం మాట్లాడుతూ రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన 33 మంది పేర్ల జాబితాలో తన పేరు లేదని, తనను ఎలా సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, దీనిపై ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.