Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలనీ, బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణనుద్దేశించిన బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు-2021ని వ్యతిరేకిస్తూ నవంబర్ 24 నుంచి 30 వరకు జరిగిన భారత్ యాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం నాడిక్కడ జంతర్ మంతర్వద్ద ఆలిండియా బ్యాంక్ అధికారుల కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ఆధ్వర్యంలో బ్యాంక్ బచావో...దేశ్ బచావో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించడానికి జాబితా చేయబడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తే, బ్యాంకు అధికారులు బ్యాంకింగ్ రంగంలోని వాటాదారులందరినీ ఏకం చేసి దేశవ్యాప్త ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. రైతుల ఉద్యమం నుంచి స్ఫూర్తిగా తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులకు సౌమ్యదత్తా సూచించారు. దేశానికి ప్రయివేట్ బ్యాంకుల అవసరం లేదనీ, భారీ లోన్ తీసుకున్నవారి నుంచి రికవరీ చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు, ఆస్తుల ప్రయివేటీకరణ విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా ఒకే స్వరంతో పోరాడాలని పిలుపునిచ్చారు. బ్యాంకు డిపాజిట్ల భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే, రైతులు, సూక్ష్మ పరిశ్రమల వంటి పేద వర్గాలకు రుణాలు అందకుండా చేసి.. ఉద్యోగాల తొలగింపునకు కారణమయ్యే బ్యాంకు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. రైతు ఉద్యమం నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోకపోతే.. రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతం చేయాలనీ, ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ భారీ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ప్రొఫెసర్ గౌరవ్ బల్లభ్, సప్తగిరి శంకర్ ఉలక, కన్నయ్య కుమార్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్, ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, ఆర్థికవేత్త డాక్టర్ ప్రసేన్జిత్ బోస్, ఏఐబీఓసీ సలహాదారు సునీల్ కుమార్, సామాజిక కార్యకర్తలు విజరు బంధు, రీతు సింగ్, అనుపమ్, విద్యార్థి నాయకుడు సాకేత్ మూన్ తదితరులు పాల్గొన్నారు.