Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల వాకౌట్.. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
- సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్
- చైర్మెన్ వెంకయ్యనాయుడు తిరస్కరణ
- 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై మండిపడ్డ ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంట్ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 16 ప్రతిపక్ష పార్టీలు రోజంతా ఉభయ సభలను బహిష్కరించాయి. ఎంపీలు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాగా, నిబంధనలకు విరుద్ధంగా ఎంపీల సస్పెన్షన్ జరిగిందనీ, ఎంపీలు క్షమాపణ చెప్పే ప్రశ్నేలేదని ప్రతిపక్షనేత మల్లి కార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఈ చర్య ప్రతిపక్షాల గొంతు నొక్కడం లాంటిదని ఆయన అన్నారు. తొలిత రాజ్యసభ ప్రారంభం కాగానే ఎంపీల సస్పెన్షన్ అంశంపై ప్రతిపక్షాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సస్పెన్షన్‌పై పునరాలోచించాలనీ, సస్పెన్షన్‌కు అనుసరించిన ప్రక్రియలో జరిగిన అవకతవకలను ఎత్తి చూపారు. ''సభా నియమాలు, విధానాలు నిబంధనల ఉల్లంఘించారని 12 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని 256 కింద పార్ల మెంటరీ వ్యవహారాల మంత్రి సభలో ప్రవేశపెట్టారు. అప్పు డు తాను 258 కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాను. సభలో ఏ సభ్యుడైన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తే హక్కు ఉందని సభా నిబంధనలు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే హక్కు ఉంది. కానీ తాను పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే అనుమతించలేదు. ఇది పార్లమెంటరీ నిబంధనల ఉల్లంఘన. రూల్ 256లోని సబ్ రూల్ 1 ప్రకారం ఏ సభ్యుడునైనా సస్పెండ్ చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టాలంటే, అంతకు ముందే చైర్మన్ ఆ సభ్యుని పేరు ప్రకటించాలి. ఆ తరువాత తీర్మానం ప్రవేశపెడతారా? అని చైర్మన్ అడిగితే అప్పుడు, తీర్మానం పెట్టాలని రూల్ 256లోని సబ్ రూల్ 2 చెబుతుంది. సభ్యుని పేరు చైర్మెన్ ప్రకటించిన తరువాత తీర్మానం ప్రవేశపెట్టి సస్పెండ్ చేయొచ్చు. ఇది ఏ రోజు జరిగిన ఘట నపై అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా తీసుకోలేదు. గత సమావేశాల్లోని ఘటనపై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 12 మంది ఎంపిలను సస్పెండ్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. కొంత మంది సభ్యులు ఆ ఘటనలో కూడా లేరు. నిబంధనల ఉల్లంఘిస్తూ తీసుకున్న ఎంపిల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి'' అని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ''రక్షించడానికి'' చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఇది అప్రజాస్వామికం కాదని చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. తాను చర్యలు తీసుకోలేదనీ, సభ తీసుకుందని అన్నారు. సభ్యులపై చర్యలు తీసుకుంటూ తీర్మానం ఆమోదం పొందిందని, అదే తుది నిర్ణయమని వెంకయ్య అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేతను తాను పరిగణనలోకి తీసుకోనని స్పష్టం చేశారు. దీంతో సస్పెన్షన్ ఎత్తివేత తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంట్ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాలతో ఎడమొఖం పెడమొఖంగా ఉన్న టీఎంసీ, సస్పెండ్ అయిన ఎంపీల్లో ఇద్దరు టీఎంసీ సభ్యులు ఉండేసరికి అనివార్యంగా ప్రతిపక్షాల ఆందోళనలో భాగస్వామ్యం అయింది. అంతకు ముందు 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడును ప్రతిపక్షాలు కలిశాయి. మరోవైపు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఇటీవలి దాద్రా నగర్ హావేలీ ఉప ఎన్నికల్లో గెలిచిన శివసేన ఎంపి కళాబిన్ మోహన్భాయి దేల్కార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. దీంతో వెంటనే ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాలకే మధ్యాహ్నాం రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనతో సభ మూడు నిమిషాలకే గంటపాటు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీస్ నిబంధనలు) సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. వివిధ సమస్యలపై ప్రతిపక్షాల ఆందోళనతో మధ్య వరుసగా రెండో రోజు లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. లోక్‌సభ, రాజ్యసభ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా కాంగ్రెస్ లోక్‌సభ ఎంపి కె సురేష్ పార్లమెంట్ కారిడార్ నేలపై జారిపడ్డారు. అతనికి ప్రథమ చికిత్స అందించి ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు.
నేటీ నుండి ధర్నా
రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష ఎంపీలు నేటీ (బుధవారం) నుంచి మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగనున్నారు. సభ కార్యకలా పాలు పూర్తి అయ్యేవరకు 12 మంది పార్లమెంట్ ఆవరణం లో ఆందోళన కొనసాగిస్తారు. మరోవైపు ఇదే అంశంపై ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తారు.
16 ప్రతిపక్ష పార్టీలు సమావేశం
12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై 16 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. మంగళవారం పార్లమెంట్ ప్రారంభానికి ముందు ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో 16 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం అయ్యారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, డిఎంకె, శివసేన, ఎన్సిసి, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జెడి, ఐయుఎంఎల్, ఎండిఎంకె, ఎల్‌జెడి, నేషనల్ కాన్ఫెరెన్స్, ఆర్ఎస్పి, టిఆర్ఎస్, కేరళ కాంగ్రెస్, విసికె, ఆప్ పార్టీల నేతలు పాల్గొన్నారు.