Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా ఎల్డీఎఫ్ ఆందోళలు
- కేంద్రం తీరును తీవ్రంగా నిరసించిన పినరయి విజయన్
తిరువనంతపురం : కేరళలో అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం మోకాలొడ్డుతోంది. వినాశకరమైన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రమంతటా మంగళవారం నాడు పెద్ద ఎత్తున్న ఆందోళనలు నిర్వహించారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించిన ఈ ధర్నాల్లో వేలాది మంది పాల్గొన్నారు. తిరువనంతపురంలోని రాజ్‌భవన్ ఎదురుగా జరిగిన ధర్నాలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులనేవి రాష్ట్రానికి హక్కులే కానీ కేంద్రమిచ్చే బహుమతులు కాదని తెలిపారు. కేరళ రాష్ట్రం కాబట్టి అభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారా? అని ఆయన నిలదీశారు. శబరి రైలు ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతాన్ని భరించడానికి కేంద్రం ముందుకొచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తోందని విమర్శించారు. కాలికట్ విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికను కూడా ఇబ్బందుల్లో పడేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు.
'కె-రైల్' వ్యయాన్ని భరించడానికి కేరళ ప్రభుత్వం సిద్ధంగా వుందనీ, కానీ కేంద్రం ముందుకు కదలడానికి విముఖత చూపుతోందన్నారు. జిల్లాల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాలకు సిపిఐ నేత కానమ్ రాజేంద్రన్ (కొల్లాం), ఎల్డిఎఫ్ కన్వీనర్ ఎ విజయరాఘవన్ (కొజికోడ్), సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఇ.పి.జర్యారన్ (కన్నూర్), పి.కె.శ్రీమతి (మలప్పురం), డాక్టర్ టి.ఎం.థామస్ ఇజాక్(అలప్పూజ), ఎ.కె.బాలన్(పాలక్కాడ్), రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.ఎం.మణి(ఇడుక్కి), ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు పి.సి.చాకో(ఎర్నాకులం), జనతాదళ్ నేత మాథ్యూ టి.థామస్ (పతనంతిట్ట), సిపిఐ నేత పాణ్యన్ రవీంద్రన్(కాసర్కోడ్), కేరళ కాంగ్రెస్ నేత ఎన్.జయరాజ్ (కొట్టాయం), కాంగ్రెస్ ఎస్ నేత కాదనప్పల్లి రామచంద్రన్ (వాయనాడ్) నేతృత్వం వహించారు.