Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను విమర్శిస్తూ ఫేస్బుక్లో కొందరు అభ్యంతరకర పోస్టులు చేశారని పేర్కొంటూ కన్నౌజ్ జిల్లాకు చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి వేదికైన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై తొలుత ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. నిరాకరించడంతో జిల్లా కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా జుకర్‌బర్గ్‌తో పాటు మరో 49 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అఖిలేష్‌పై మెటా (గతంలో ఫేస్బుక్) సీఈఓ ఎటువంటి పోస్టులు చేయనప్పటికీ.. అఖిలేష్ పరువుకు భంగం కలిగించేలా ఫేస్బుక్ ప్లాట్‌ఫాంను వినియోగించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఫిర్యాదుదారుడికి సూచించింది. అనంతరం ఆయన వాటిని కోర్టుకు అందించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. అఖిలేష్‌పై అనుచిత పదజాలం ప్రయోగించినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు జూకర్‌బర్గ్‌తోపాటు పలువురిపై తొలుత కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన పేరు తొలగించారు. అనుచిత వ్యాఖ్యలకు వేదికైన సదరు ఫేస్బుక్ పేజీ నిర్వాహకుడిపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.