Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 9.3 శాతానికి
- పురుషుల్లో 8.6 శాతం.. మహిళల్లో 11.8 శాతం మంది : ఎన్ఎస్ఓ సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో పట్టణ నిరుద్యోగ రేటు పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 9.3 శాతానికి చేరింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఈ సమాచారం వెల్లడైంది. గతేడాది ఇదే సమయంలో నిరుద్యోగ రేటు 9.1 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే, గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగ రేటు అత్యధికంగా 20.8 శాతాన్ని చేరిన విషయం విదితమే. అయితే, 9.3 శాతం నిరుద్యోగ రేటు దీనితో పోలిస్తే చిన్నగానే కనబడినప్పటికీ కోవిడ్ పరిస్థితులకు ముందు గణాంకాలతో పోల్చుకుంటే మాత్రం అధికమని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి పట్టణ నిరుద్యోగానికి సంబంధించి ఎన్ఎస్ఓ వెల్లడించిన సమాచారం ప్రకారం.. మహిళల్లో నిరుద్యోగం పురుషులతో పోల్చుకుంటే అధికంగా ఉన్నది. వీరిలో 11.8 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. గతేడాది ఇదే సమయంలో మహిళల నిరుద్యోగ రేటు 10.6 శాతంగా ఉండటం గమనించాల్సిన అంశం. ఇక మగవారిలో నిరుద్యోగ రేటులో ఏ మాత్రమూ తేడా కనిపించలేదు.
గతేడాదితో లాగే ఈ ఏడాదీ అది 8.6 శాతంగానే ఉన్నది. ఇదే సమయంలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (జనాభాలోని శ్రామిక శక్తిలో వ్యక్తుల శాతం) 47.5 శాతానికి తగ్గింది. గతేడాది ఇది 48.1 శాతంగా నమోదైంది. ఇటు మహిళల భాగస్వామ్యమూ 21.2 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో ఇది 21.9 శాతంగా ఉన్నది.
ఇక దేశవ్యాప్తంగా ఉపాధిని కలిగి ఉన్నవారి సంఖ్య కూడా పడిపోయింది. గతేడాది ఇది 43.7 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 43.1 శాతానికి తగ్గింది. ఇదిలా ఉండగా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) విడుదల చేసిన సమాచారం ప్రకారం (గతనెల 29 నాటి వరకు) దేశంలో నిరుద్యోగ శాతం 7.13 శాతంగా ఉన్నది. '' దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నదని కేంద్రం చెప్తున్నది. కానీ, నిరుద్యోగం దేశమంతటా తీవ్ర సమస్యగా పరిణమించింది. పట్టణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ప్రస్తుతం కేంద్రం ముందున్న సవాలు. దేశంలో ఈ సమస్య ప్రతి ఏడాదీ క్రమంగా పెరుగుతున్నది'' అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.