Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల్లో విభజనకు మోడీ సర్కార్ కుట్ర :ఎస్కేఎం
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల గురించి ప్రభుత్వానికి గుర్తుచేస్తూ ఎస్కేఎం రాసిన లేఖకు అధికారికంగా స్పందించకుండా, అధికారిక చర్చలను తిరిగి ప్రారంభించకుండా నిరసన తెలుపుతున్న రైతులను విభజించడానికి మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రయత్నాలను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఖండించింది. రైతు సంఘాలు తమ డిమాండ్లపై ఐక్యంగా ఉన్నాయనీ, ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని వివరాలతో కూడిన అధికారిక సమాచారం కోసం ఎస్కేఎం వేచి ఉందని తెలిపింది. నిరసన తెలిపిన రైతులు మరణించిన రికార్డులు లేవని చెబుతూ కేంద్ర ప్రభుత్వం, రైతుల భారీ త్యాగాలను అవమానిస్తూనే ఉన్నదని ఎస్కేఎం విమర్శించింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పందనను ఖండించింది.
నరేంద్ర సింగ్ తోమర్ రైతుల ఉద్యమంలో మరణాల గురించి ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదని, అందువల్ల ఆర్థిక సహాయం గురించి ప్రశ్న తలెత్తదని అనడం దారుణమని పేర్కొంది. కొనసాగుతున్న ఆందోళనలో 689 మందికి పైగా అమరవీరుల బంధువులకు పరిహారం, పునరావాసం కోసం ఎస్కేఎం తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఉద్యమ శిబిరాలు మునుపటిలా కొనసాగుతున్నాయనీ, వాస్తవానికి మరిన్ని ట్రాక్టర్ ట్రాలీలు నిరసన ప్రదేశాలకు చేరుకుంటున్నాయని ఎస్కేఎం తెలిపింది. నిరసనలు ముగియడం, ప్రజలు ఆందోళన శిబిరాలను ఖాళీ చేయడం గురించి అసత్య ప్రచారం చేయవద్దని రైతులందరికీ, మీడియా ప్రతినిధులకు ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది. తమ యూనియన్ల మధ్య చీలిక ఉన్నదని చెప్పడం కూడా సరికాదని హితవు పలికింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర రైతు సంఘాల నాయకుల మధ్య ఎటువంటి సమావేశం జరగలేదనీ, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు, దీనికి సంబంధించి అధికారిక సమాచారం వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని ఎస్కేఎం పునరుద్ఘాటించింది.