Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు చెల్లవ్: ఏఐకేఎస్ నేతలు హన్నన్ మొల్లా, విజూ కృష్ణన్, కృష్ణ ప్రసాద్
న్యూఢిల్లీ: ఉద్యమంలో మరణించిన రైతుల రికార్డు లేవనడం విడ్డూరంగా ఉన్నదనీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ కొనసాగే హక్కు లేదని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా విమర్శించారు. రైతుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవనీ, తామంతా ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. బుధవారం నాడిక్కడ స్థానిక ఏఐకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, కోశాధికారి పి.కృష్ణప్రసాద్లతో కలిసి హన్నన్ మొల్లా మాట్లాడారు. ఏడాది ఐక్యంగా పోరాడుతున్న రైతుల మధ్య విభజనను సృష్టించడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదనీ, అయితే రైతుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం బీజేపీ వల్ల కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు గత ఏడాదిగా ఎన్నోసార్లు చేసి, భంగపాటుకు గురైందని వివరించారు. ఎంఎస్పీపై కమిటీకి సంబంధించి నాయకులతో వ్యక్తిగత చర్చలు, కేసుల ఉపసంహరణ కోసం ముఖ్యమంత్రులతో సమావేశం మొదలైన వాటిపై అధికార యంత్రాంగం, పోలీసులను సమాచారం ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఎస్కేఎంతో చర్చలకు ప్రత్యామ్నా యం లేదని, తామంతా ఐక్యంగా ఉన్నామని, ఎస్కేఎంతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారికంగా లేకుండా కొన్ని సంఘాలతో అనధికారిక చర్చలు జరిపి రైతులను విభజించాలని చూస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.