Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ రకాల పేదరికంలో 25 శాతం మంది భారతీయులు
- 2015-16 ఎన్హెచ్ఎఫ్ఎస్ ఆధారంగా నిటి ఆయోగ్ నివేదిక
- ఎంపీఐలో 109 దేశాల్లో 62వ స్థానంలో భారత్
న్యూఢిల్లీ : భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు వివిధ రకాలైన పేదరికంలో ఉన్నారు. 2015-16 ఏడాదికి సంబంధించిన జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్) ఆధారంగా నిటి ఆయోగ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. '' భారతదేశంలో 25.01 శాతం మంది ప్రజలు బహుమితీయ పేదరికంలో ఉన్నారన్న విషయాన్ని జాతీయ బహుమితీయ పేదరిక సూచి (ఎంపీఐ) గుర్తించింది'' అని నివేదిక వివరించింది.
ఆక్స్ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్ఐ), యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) అభివృద్ధి చేసిన పద్దతులను ఉపయోగించి భారత జాతీయ ఎంపీఐని రూపొందించినట్టు నిటి ఆయోగ్ చైర్మెన్ రాజీవ్ కుమార్ తెలిపారు.
2021లో 27 శాతానికి పైగా
ఇదిలా ఉండగా, 2021 ఎంపీఐ ప్రకారం 27.9 శాతం మంది భారతీయులు బహుమితీయ పేదరికంలో ఉన్నారు. దీనిని యూఎన్ డీపీ, ఓపీహెచ్ఐ లు ఆవిష్కరించాయి. కాగా, ఈ సూచిలో 109 దేశాలకు గానూ భారత్ 62వ స్థానంలో ఉన్నది. తాగునీటి వసతులు లేకపోవడం, సరైన పోషకాహారం అందకపోవడం లేదా కనీసం ఆరేండ్ల స్కూలింగ్ వంటి 10 సూచికల ఆధారంగా ఈ సూచీను రూపొందించారు. కాగా, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికంపై ఈ ఎంపీఐ నివేదికనే (2015-16కు సంబంధించి నిటి ఆయోగ్ నివేదిక) మొదటిది. అలాగే, పూర్వపు దారిద్య్రరేఖ పద్ధతిని నిటి ఆయోగ్ ఇప్పటికే విడిచిపెట్టింది. 2019-20 ఏడాదికి సంబంధించి ఎన్హెచ్ఎఫ్ఎస్ సమగ్ర నివేదిక అందిన తర్వాత మరొక ఎంపీఐతో నిటి ఆయోగ్ ముందుకొస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2019-20 ఎన్హెచ్ఎఫ్ఎస్ సమాచారాన్ని కేంద్రం ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే.
ఎంపీఐలో తీసుకున్న అంశాలివే
ఎంపీఐలో ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, విద్య, జీవిన విధానం వంటి మూ డు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో పోషకాహారం, పిల్లలు, కౌమార దశ మరణాలు, పాఠశాల హాజరు, వంటగ్యాస్, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, పక్కా ఇండ్లు, బ్యాంకు ఖాతాలు వంటి అంశాలు ఉన్నాయి. ఇందులో పోషకాహారం (37.6 శాతం మంది), శిశు, కౌమార దశ మరణాలు (2.7 శాతం), తల్లి ఆరోగ్యం (22.6శాతం), ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (13.9 శాతం), పాఠశాల హాజరు(6.4 శాతం), వంట ఇంధనం (58.5శాతం), పారిశుధ్యం (52 శాతం), తాగు నీరు (14.6శాతం), విద్యుత్ (12.2శాతం), హౌజింగ్ (45.6శాతం), ఆస్థులు (14 శాతం), బ్యాంకు ఖాతా (9.7) వంటి అంశాల్లో ప్రజలు వెనుకబడిపోయారు.
గత గణాంకాలు ఇలా..
కాగా, గతంలో ప్లానింగ్ కమిషన్ దారిద్య్ర రేఖను ఆధారంగా తీసుకొని పేదరికాన్ని గణించేది. 2011-12లోనే ఇలాంటి గణాంకాల ప్రకారం.. 21.9 శాతం మంది భారతీయులు పేదరికంలో ఉన్నారు. 2009-10లో ఇది 29.8 శాతంగా ఉండటం గమనార్హం. సురేశ్ టెండూల్కర్ పద్దతిని ఉపయోగించి దీనిని రూపొందించారు. పట్టణాల్లో రూ. 33 కంటే ఎక్కువ, గ్రామాల్లో రూ. 27 కంటే ఎక్కువ ఖర్చు చేసిన వారిని ఇందులో పేదలుగా పరిగణించలేదు. అయితే, దేశంలో పేదరికంగా 2011-12లో 29.5 శాతంగా ఉన్నదని సి. రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ ఆ సమయంలో మరొక నివేదికతో ముందుకొచ్చింది. ఇందులో పట్టణాల్లో రూ. 47 కంటే, గ్రామాల్లో రూ. 32 కంటే తక్కువ ఖర్చు చేసినవారిని పేదలుగా పరిగణించారు. అయితే, ఈ దారిద్య్ర రేఖ పద్దతిని ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015, జనవరి 1న వచ్చిన నిటి ఆయోగ్ తొలగించింది.