Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది ఎంపీల సస్పెన్షన్పై భగ్గుమన్న పార్లమెంట్
- గాంధీ విగ్రహం వద్ద ఎంపీల ధర్నా
- సేవ్ ఇండియా, నిరంకుశం నశించాలంటూ నినాదాలు
- పలువురు ఎంపీల సంఘీభావం
- రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన
- ఉభయసభల్లో ధాన్యం కోనుగోళ్లపై టీఆర్ఎస్ ఆందోళన
న్యూఢిల్లీ : 12మంది ఎంపీల సస్పెన్షన్పై పార్లమెంట్ దద్దరిల్లింది. ఆందోళనలు మిన్నంటాయి. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, పార్లమెంట్ ఆవరణలోనూ నినాదాలు హౌరెత్తాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపైన ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. నిబంధనలు తుంగలో తొక్కి ప్రతిపక్ష ఎంపీల గొంతెనొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించాయి. బుధవారం పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ''ఎంపీలపై వేటు రద్దు చేసి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలి. సేవ్ ఇండియా'' ప్లకార్డు పట్టుకొని ''మోడీ సర్కార్ డౌన్ డౌన్. నిరంకుశం నశించాలి. ఎంపీల సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలి. ప్రజా స్వామ్య ఖూనీ ఆపాలి. మాకు న్యాయం కావాలి'' అంటూ నినాదాల హౌరెత్తిం చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడుతూ ''దేశంలో ప్రజల గొంతులు వినిపించేందుకు అర్హులను కేంద్రం గుర్తించాలా?. పార్లమెంటులో చర్చ కోసం, ప్రజల అభిప్రాయాలను తెలియజే యడానికి ఆ 12మంది ఎంపీలను అను మతించాలి. అప్పుడే ప్రజాస్వామ్యయుత పార్లమెంటును నిజంగా నడపగలరు'' అని సీనియర్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ''రాజ్యసభలో 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం'' రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టిఆర్ బాలు (డీఎంకే), రామ్గోపాల్ యాదవ్ (ఎస్పీ), ఎల మారంకరీం (సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), ప్రియాంక చతుర్వేది (శివసేన), సౌగత్రారు (టీఎంసీ), సుప్రియా సూలే (ఎన్సీపీ)లతో ఆర్జేడీ, ఐయుఎంఎల్, వీసీకే, ఆర్ఎస్పీ తదితర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సస్పెండ్ అయిన 12 మంది ఎంపీలు ధర్నా చేపట్టారు. వీరికి పలువురు ఎంపీలు సంఘీభావం తెలుపుతున్నారు. ''ఎంపీలపై విధించిన సస్పెన్షన్ అధికార అహంకారాన్ని తెలియజేస్తోందన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగించేవారు. మాకు న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తాం'' అని ఆందోళన చేసిన ఎంపీలు స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం మాట్లాడుతూ రాజ్యసభలో ప్రభుత్వం మెజార్టీ లేనందున ప్రభుత్వం తమను సస్పెండ్ చేసి బిల్లులను ఆమోదించుకొనేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీజేపీకి మద్దతు ఇచ్చే అన్నాడీఎంకే స్థానాలు తగ్గాయనీ, ఆ స్థానంలో డీఎంకే స్థానాలు పెరిగాయనీ, దీన్ని దష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీల ఎంపీలపై సస్పెండ్ చర్యలు చేపట్టిందని ఆరోపించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పేదీ లేదని స్పష్టం చేశారు. సస్పెన్షన్ వేటు ఎత్తివేసేవరకు తమ ఆందోళన కొనసాగుతోందని స్పష్టం చేశారు.
రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మె వెంకయ్యనాయుడు కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎల్డీఎఫ్ ఎంపీ జోస్ కె.మణి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 12 మంది సభ్యుల సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాల హౌరెత్తించారు. ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో రెండు నిమిషాలకే మళ్లీ గంట పాటు వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నాం 2 గంటలకు ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనల నడుమే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ డ్యాం సేఫ్టీ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు గురించి కేంద్ర మంత్రి వివరిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నినాదాల హౌరెత్తాయి. దీంతో ఐదు నిమిషాలకే సభ వాయదా పడింది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను నేటీకి (గురువారం)కి వాయిదా పడింది. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాల ఆందోళన నడుమ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లుపై టీఆర్ఎస్ వెల్లో ఆందోళన చేపట్టింది. ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. దీంతో సభ అరగంటకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన నడుమా జీరో అవర్ నడిచింది. మళ్లీ సభ వాయిదా పడి మధ్యాహ్నాం 2ః35 గంటలకు ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవియా సహాయ పునరుత్పత్తి సాంకేతికత (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందింది.
పార్లమెంట్ వ్యూహాంపై సీనియర్ మంత్రులతో మోడీ భేటీ
ప్రధాని మోడీ బుధవారం తన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడంపై పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అనుసరించ వలసిన వ్యూహాలపై చర్చించారు.
ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు.