Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమర్షియల్ సిలిండర్‌పై 100 పెంపు
- ప్రధాన నగరాల్లో రూ. 2000 మార్కును దాటిన ధరలు
- హైదరాబాద్‌లో రూ. 2005కు.. చిరువ్యాపారులపై మరో భారం
న్యూఢిల్లీ : దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ. 100 పెరిగింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు చివరగా గతనెల (నవంబర్) 1న పెరిగాయి. నెల తిరిగే లోపే ఇప్పుడు సిలిండర్ ధరలు రెండోసారి భారీగా పెరగడం గమనార్హం. ఇది సామాన్యులతో పాటు ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగించే చిరువ్యాపారులు, హోటళ్లు, స్ట్రీట్‌ఫుడ్ వెండర్ల నిర్వాహకులపై భారాన్ని మోపనున్నాయి. పెరిగిన ధరలతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ. 2000 మార్కును చేరుకున్నాయి.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ల ధరలు రూ. 2101కు చేరుకున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో వీటి ధరలు రూ. 2051కు ఎగబాకాయి. కోల్‌కతాలో వీటి ధరలు షాకిస్తున్నాయి. ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2174.50గా పలుకుతున్నది. ఇక చెన్నైలో మరింత అత్యధికంగా రూ. 2234.50కు కమర్షియల్ సిలిండర్లు దొరుకుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1905గా ఉండగా పెరిగిన ధరలతో అది రూ. 2005కు చేరుకున్నది.
నవంబర్ 1 వరకు ఢిల్లీలో ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1734గా ఉన్నది. అయితే, నవంబర్ 1న వీటి ధరలు ఏకంగా రూ. 266 మేర పెరిగాయి. దీంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఒక్కసారిగా రూ. 2000 మార్కును దాటి చుక్కలు చూపించాయి. ఇక సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 899.50గా ఉన్నది. అలాగే, కోల్‌కతాలో రూ. 926, ముంబయిలో రూ. 899.50, చెన్నైలో రూ. 915.50గా ఉన్నాయి.