Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలో సీపీఐ(ఎం) నేతల డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో మైనార్టీలపై దాడులు ఆపాలనీ, తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నేతలు డిమాండ్ చేశారు. మైనార్టీలపై దాడులకు నిరసనగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. వందలాది మంది సీపీఐ (ఎం) కార్యకర్తలు ప్లకార్డు చేబూని మైనార్టీలపై దాడులకు నిరసనగా పెట్టపెట్టున నినాదాల హౌరెత్తించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, హన్నన్ మొల్లా, బృందా కరత్, బివి రాఘవులు, సీపీఐ (ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సెహబా ఫరూఖీ ప్రసంగించారు. మైనారిటీ వర్గాలపైన, క్రిస్టియన్, ముస్లింలపైన సంఫ్‌ు పరివార్‌కు అనుబంధంగా ఉన్న సంఘాలు దాడులకు పాల్పడుతున్నా యని విమర్శించారు. మైనార్టీలపై దాడులు పెరగడం ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి మతోన్మాద చర్యలకు పాల్పడినవారు చట్టం నుంచి మినహాయింపు పొందుతున్నా రని ఆరోపించారు. బాధితులను రక్షించడానికి బదులు, అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలన బాధితులను, వారికి మద్దతు ఇచ్చేవారిని తప్పుడు కేసులు, క్రూరమైన క్లాజుల కింద అరెస్టులు చేసి శిక్షిస్తున్నారని తెలిపారు. ''ముస్లిం మైనారిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. వారిపై 'గోసంరక్షణ', 'లవ్ జిహాద్' పేరుతో మూకదాడులు జరుగుతున్నాయి. మైనార్టీలపై హత్యలు, తప్పుడు అరెస్టులు, మూక హింస కేసులు కొనసాగుతున్నాయి. త్రిపురలో వీహెచ్‌పీ గుండాలు మైనారిటీ వర్గాలపై దాడి చేయడంతో పాటు కొన్ని మసీదులను ధ్వంసం చేయడం ఇటీవలి జరిగింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కాకుండా, ఆయా ప్రదేశాలను సందర్శించవారిపైన, జర్నలిస్టులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగమైన గుర్గావ్లో ప్రార్థనలు చేసే హక్కును నిరోధించడం మరొక ఉదాహరణ. ఘజియాబాద్‌లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో ఏడుగురు అమాయక ముస్లిం యువకులను బలిగొన్నారు. గోహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మోకాళ్ల కింద కాల్చి చంపబడ్డారు. మొత్తం ప్రాంతాన్ని మతపరమైన ధ్రువీకరణకు రూపకల్పన చేయడంలో భాగంగా మోసపూరిత ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం వీధి వ్యాపారులను బెదిరించారు. వారి జీవనోపాధిని కొనసాగించుకునేందుకు అనుమతించలేదు. అసోంలో దశాబ్దాలుగా భూమిని సాగుచేసుకుంటున్న పేద రైతు కుటుంబాలు కేవలం ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినవారనే కారణంగా క్రూరంగా తొలగించబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై రాజద్రోహం కేసులను బనాయించటం సర్వసాధారణమైంది'' విమర్శించారు. హిందుత్వ సంస్థలు క్రైస్తవ వర్గానికి చెందిన వారిపై కూడా దాడి చేశాయనా, ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య క్రైస్తవులపై 300 పైగా దాడులు జరిగాయని తెలిపారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ద్వారకలో చర్చిపై జరిగిన దాడి తాజా ఉదాహరణ అని పేర్కొన్నారు. మైనారిటీలపై జరుగుతున్న ఈ దాడులు భారత రాజ్యాంగంపై దాడి చేయడంతోపాటు మనుస్మృతిని దేశంపై రుద్దేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని విమర్శించారు. మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల్లో పెరుగుతున్న ఐక్యతను విభజించే దుష్ట పన్నాగంలో ఈ దాడులు మరింత భాగమని స్పష్టం చేశారు. ఘజియాబాద్, నోయిడాలో కూడా నిరసనలు జరిగాయనీ, ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌కు బూటకపు ఎన్కౌంటర్ సమస్యను ఎత్తిచూపుతూ మెమోరాండం కూడా సమర్పించామని తెలిపారు.