Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..!
- పార్లమెంట్లో మీడియా నిరాకరణపై జర్నలిస్టులు ఆందోళన
న్యూఢిల్లీ : పార్లమెంట్లో మీడియాను అనుమతించక పోవడాన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. గురువారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) వద్ద వందలాది మంది జర్నలిస్టులు, పత్రికలు, మీడియా సంస్థల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ''పత్రికా స్వేచ్ఛకు లాంగ్ లైవ్'' వంటి నినాదాలు చేస్తూ పార్లమెంటుకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. ''లాటరీ విధానం'' ద్వారా పార్లమెంటు శీతాకాల సమావేశాలను కవర్ చేసే రిపోర్టర్ల సంఖ్యను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ''ప్రజలకు వార్తలు, సమాచారాన్ని సెన్సార్ చేయడానికి ఒక ఎత్తుగడ'' అని పేర్కొన్నారు. కరోనా వైరస్ సాకును చూపి ప్రభుత్వం గత ఏడాది నుంచి మీడియా సిబ్బందిని పార్లమెంటులోకి ప్రవేశించడాన్ని పరిమితం చేసిందని సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశారు పేర్కొన్నారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశానికి ముందు లోక్‌సభ (దిగువ సభ) లోపల 60 మంది, రాజ్యసభ (ఎగువ సభ)లో 32 మంది జర్నలిస్టులను అనుమతించేందుకు ''లాటరీ విధానం'' ప్రవేశపెట్టబడింది. వరుసగా 11, 10 స్లాట్లు ప్రభుత్వ నిర్వహణకు కేటాయించబడ్డాయి. కొన్ని ఎంపిక చేసిన మీడియా సంస్థలు, ఏజెన్సీలకు మాత్రమే అనుమతి లభిస్తోంది. పార్లమెంట్‌కు అనుమతించబడిన జర్నలిస్టుల సంఖ్య తీవ్రంగా తగ్గించబడిందని అన్నారు. ''ఇది 2020లో కోవిడ్ సాకుతో ప్రారంభమైంది, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. మనం ఇప్పుడు నిరసన తెలపకపోతే, ఇది శాశ్వతం అవుతుంది'' అని రాజ్‌దీప్ సర్దేశారు అన్నారు. ''ప్రస్తుతం రూపొందించబడిన లాటరీ విధానం చిన్న వార్తా పత్రికలకు అనుమతి ఉండదు. సంసద్ టీవీ చూడటం ద్వారా మాత్రమే మీరు పార్లమెంటును కవర్ చేయలేరు. అది ప్రభుత్వ ఛానల్'' అని తెలిపారు. ''పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం మీడియాను రిపోర్టింగ్ చేయకుండా ఉంచడం అప్రజాస్వామికం'' అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ సంజరు కపూర్ అన్నారు. ''జర్నలిస్టులను దూరంగా ఉంచడానికి కరోనా వైరస్ సాకును ఉపయోగిస్తున్నారు. మాల్స్, విమానయాన సంస్థలు తెరిచినప్పటికీ మీడియాను దూరంగా ఉంచాలనుకుంటున్నారు. వారి ఉద్దేశాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు. ''ఇది ఈ ప్రభుత్వంలో కనిపించే ఒక నమూనా. మీడియా ప్రశ్నించడం వారికి ఇష్టం లేదు'' అని పేర్కొన్నారు. ''ప్రభుత్వ చర్య మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 19 రోజుల పాటు జరిగే శీతాకాల సమావేశాలలో నేను నాలుగు లేదా ఐదు రోజులు మాత్రమే పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేయగలను. ఎందుకంటే మీడియా సంస్థలకు లాటరీ ప్రాతిపదికన పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేయడానికి అవకాశం ఉంది'' అని పార్లమెంట్ కవర్ చేస్తున్న జర్నలిస్టు తెలిపారు. ''ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్‌లోకి పాత్రికేయుల ప్రవేశం 'లాటరీ విధానం' ద్వారా నియంత్రించబడుతుంది. భారతదేశం వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి'' అని పీసీఐ పేర్కొంది. మహమ్మారి నేపథ్యంలో గత ఐదు పార్లమెంట్ సమావేశాల నుంచి పార్లమెంట్లో రిపోర్టర్లపై ఆంక్షలు కఠినతరం చేశారని తెలిపింది. తమకు ఇచ్చిన హామీ పాటించలేదని స్పష్టం చేసింది. పీసీఐ రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. మహమ్మారి ఎక్కువ ఉన్న మార్కెట్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాలపై ఆంక్షలు ఎత్తివేశారని, కానీ పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జర్నలిస్టులకు మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో డీయూజే అధ్యక్షుడు ఎస్కె పాండే, జర్నలిస్టులు పాల్గొన్నారు.