Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో బయటపడిన రెండు కేసులు
- అప్రమత్తమైన కేంద్రం
- 29దేశాలకు పాకిన వేరియంట్
- మొత్తంగా 373 కేసులు నమోదు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనపరు స్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోనూ వెలుగు చూసింది. కర్నాటకలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ విదేశాల నుండి వచ్చిన వారే. వెంటనే వారిని ఐసొలేషన్‌కు పంపామని, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను కూడా చాలావరకు కనుగొన్నామని, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఈనెల 1న, 20న బెంగళూరు విమానాశ్రయంలో వీరుదిగారు. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా జాతీయుడు (66ఏండ్లు) కాగా, మరొకరికి 46 ఏండ్లు, బెంగళూరు వాసి. వీరిద్దరికి తొలుత కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో వెంటనే వారి నమూనాలను జన్యు పరీక్షల విశ్లేషణకు పంపారు. అక్కడ వీరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్ల డైందని ఇండియన్ సార్స్-కోవ్-2 జెనొమిక్స్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) ధ్రువీకరించింది. వెంటనే కేంద్రం అమ్రత్తమైంది. అయితే వారిద్దరిలోనూ తీవ్రమైన లక్షణాలేవీ కనిపించడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. బెంగళూరు వాసి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే వున్నారని, అతని ఆరోగ్యం బాగానే వుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన్ని కలిసిన వారికి కూడా ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. నవంబరు 1న భారత్‌కు వచ్చిన ఆయన 14రోజుల క్వారంటైన్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక రెండో వ్యక్తి నవంబరు 20న బెంగళూరుకు చేరుకున్నాడని, ఒక హోటల్లో క్వారంటైన్లో వున్నారని, ఆ హోటల్లోని 212మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించామని అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. కర్నాటక ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఒమిక్రాన్ వేరియంట్ పెచ్చరిల్లకుండా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేడీ కర్జన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేకంగా ఒమిక్రాన్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సిఫారసు చేసింది. దీనిపై ఎవరూ అధికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తత, అవగాహనతో మెలిగితే చాలని కేంద్ర ఆరోగ శాఖ ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ ముప్పు వున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరని ప్రకటించింది. కాగా, టీకా రెండు డోసులు తీసుకున్నా కూడా ఈ వేరియంట్ సోకిందని అధికారులు చెప్పారు. తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకు 29దేశాలకు పాకింది. మొత్తంగా 373 కేసులు నమోదయ్యాయి.
వ్యాక్సిన్లలో అసమానతలే కారణం ! : కొత్త వేరియంట్ల పుట్టుకపై డబ్ల్యూహెచ్ఓ
వ్యాక్సిన్లలో అసమానతలే కొత్త వేరియంట్ల ఆవిర్భవానికి కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా వుండడం, పరీక్షలు తక్కువగా నిర్వహించడం వల్ల కొత్త రకాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది. అందువల్లే ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సలు అన్నింటికీ సమాన అవకాశాలు వుండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చామని స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్‌ను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలే ఒమిక్రాన్‌కు కూడా వర్తిస్తాయని తెలిపింది. అన్ని దేశాలు సాధ్యమైనంత రీతిలో ప్రజారోగ్య, సామాజిక చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్ర్ో అదనామ్ గెబ్రెయెసస్ కోరారు. గతంలో డెల్టా వేరియంట్ తలెత్తినపుడు కూడా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు వాటిని కొనసాగిస్తే వైరస్ ప్రబలకుండా చూడగలుగుతామని అన్నారు. కాగా, తాజాగా ఒమిక్రాన్ ముప్పుతో 2021 అభివృద్ధి అంచనాలు 5.7శాతం నుండి 5.6శాతానికి తగ్గాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఓఈసీడీ తెలిపింది. మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై తీవ్ర ప్రభావం వుంటుందని హెచ్చరించింది.వ్యాక్సిన్లలో అసమానతలు తొలగించాలని డబ్ల్యూహెచ్ఓ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నా సంపన్న దేశాలు పట్టించుకోలేదు.
వ్యాక్సిన్ పూర్తిగా వేసుకున్న జనాభా ప్రపంచ సగటు 43 శాతం కాగా, ఆఫ్రికా ఖండంలో ఇది కేవలం 6.7 శాతం మాత్రమే. ఒక డోసు మాత్రమే వేసుకున్న వారి శాతం 9.9 మాత్రమే నని ఆఫ్రికన్ సీడీసీ నివేదిక తెలిపింది. ఊహించని రీతిలో ఈ వేరియంట్ మ్యుటేట్ కావడానికి ఇదొక ముఖ్య కారణమని ఆ రిపోర్టు వివరించింది.