Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధలనకు విరుద్ధంగా ఎలమారం కరీం సస్పెన్షన్
- నిలదీసిన సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
- రాజ్యసభలో డ్యామ్ సేఫ్టీ బిల్లు ఆమోదం
- కొనసాగిన 12 మంది సస్పెండ్ సభ్యుల ధర్నా
- లోక్‌సభలో కరోనాపై స్వల్పకాలిక చర్చ
- ప్లకార్డులను చించి పైకి విసిరిన టీఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ : రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మెన్ వెంకయ్యనాయుడు 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఇది ప్రజాస్వామ్యం కాదని వెంకయ్య అన్నారు. ప్రతిపక్ష నేతలకు మాట్లాడేఅవకాశం కల్పించాలని కోర గా అందుకు చైర్మెన్ నిరాకరించారు. జీరో అవర్ నిర్వ హించడానికి ఆయన ప్రయత్నించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు తమ నినాదాలతో హౌరెత్తించారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో చైర్మెన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే గంట పాటు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలతో హౌరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు సీపీఐ(ఎం) సభ్యుడు జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ప్రయత్నించారు. కానీ డిప్యూటీ చైర్మెన్ అనుమతి ఇవ్వలేదు. ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తమకు అనుమతి ఇవ్వటం లేదని, తామంతా ధరలు పెరుగుదలపై చర్చించాలని కోరుతున్నా అనుమతి ఇవ్వటం లేదని అన్నారు. ధరలు పెరుగుదలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. అలాగే ఈ అంశాలపై వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ధరలు పెరుగుదల, రైతులు సమస్యలు, కనీస మద్దతు ధర, అప్పటి ఘటనలో పేరు లేకుండానే ఎలమారం కరీంను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఆర్జేడీ, ఎన్సీపీ, డీఎంకే, టీఎంసీ, టీఆర్ఎస్, ఐయుఎంఎల్ తదితర పార్టీల సభను వాకౌట్ చేశాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగిన తరువాత సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.
కరీం సస్పెన్షన్‌పై నిలదీసిన సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
సభ ప్రారంభమైన వెంటనే సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రూల్ బుక్ తీసుకొని, రూల్ 256 కింద ఎలమారం కరీం సస్పెండ్‌ను లేవనెత్తారు. ఆయన పేరు చైర్మెన్ చెప్పకుండానే సస్పెండ్ చేశారని తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ జోక్యం చేసుకొని''డ్యాం సేఫ్టీ బిల్లు చర్చకు తీసుకున్నాం. మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కేవలం బిల్లుకు సంబందించే లేవనెత్తాలి. ఇతర అంశాలపై వద్ద'' అని అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బిల్లుపై చర్చకు అనుమతించారు. దీంతో జాన్ బ్రిట్టాస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దని, నిబంధలను పాటించాలని అన్నారు. సీపీఐ(ఎం) సభ్యుడు బ్రిట్టాస్ మాట్లాడుతూ ఎంపీ ఎలమారం కరీం సభకు హాజరుకాకపోవడం దీనికి సంబంధిం చిన అంశమని తెలిపారు. దీనికి డిప్యూటీ చైర్మెన్ ''నో...నో...సారీ'' అంటూ కేంద్ర మంత్రిని బిల్లుపై చర్చను ప్రారంభించాలని కోరారు. దీంతో సీపీఐ (ఎం) సభ్యులు తమ స్థానాల్లో నిలబడి ఎలమారం కరీం సస్పెన్షన్ ప్రస్తుత అంశమని, ఒక సభ్యుడు హాజరుకాకపోవడానికి సంబంధించినదని మొరపె ట్టుకున్నారు. ప్రస్తుత అంశంపైనే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలని, పాత అంశాలు గురించి కాదని అన్నారు. దీనికి సీపీఐ(ఎం) ఎంపీ బ్రిట్టాస్ తమ పార్టీ ఎంపీ సభకు హాజరుకాకపోవడం ప్రస్తుత అంశమని పేర్కొన్నారు. మళ్లీ కేంద్ర మంత్రి చర్చను ప్రారంభి ంచారు. సీపీఐ(ఎం) సభ్యులు మొర పెట్టుకోవడం మధ్యనే కేంద్ర మంత్రి చర్చ పూర్తి అయింది. డ్యాం సేఫ్టీ బిల్లుపై డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సవరణలు ప్రవేశపెట్టారు.అనంతరం డ్యాం సేఫ్టీ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యుల చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభలో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు.వెల్‌లోకి దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలతో హౌరెత్తి ంచారు.టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన నడుమే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ప్లకార్డులను చించి పైకి విసిరారు. అనంతరం రూల్ 193 కింద కరోనాపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు మాట్లాడిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సమాధానం ఇచ్చారు.
కొనసాగిన 12 మంది సస్పెండ్ సభ్యుల ధర్నా
పార్లమెంట్ ఆవరణంలో ప్రతిపక్షాలు ఆందోళన గురువారం కూడా కొనసాగింది. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఆందోళన కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే,సీపీఐ(ఎం), సీపీఐ,ఎస్పీ,టీఎంసీ, ఐయుఎంఎల్, శివసేన, టీఆర్ఎస్, ఆర్ఎస్పీ, ఆర్జేడీ,ఎల్జేడీ తదితర పార్టీల సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. ప్లకార్డు లు చేబూని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాల హౌరెత్తించారు. నల్ల రిబ్బన్లు, మాస్క్‌లు పెట్టుకొని ధర్నాలో చేపట్టారు. వర్షం పడటంతో ఆందోళనను పార్లమెంట్ గేట్ నెంబర్ 1 మార్చారు. అక్కడ ఆందోళన కొనసాగించారు.