Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర జాబితాలోని డ్యామ్‌లపై బిల్లు రాజ్యాంగ విరుద్ధం
- రాష్ట్రాల ప్రయోజనాలకు దెబ్బ ఇందులో చాలా ప్రమాదకర నిబంధనలు : డ్యామ్ సేఫ్టీ బిల్లుపై సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్
న్యూఢిల్లీ : డ్యామ్ సేఫ్టీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ విమర్శించారు. రాజ్యసభలో గురువారం డ్యామ్ సేఫ్టీ బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున ఆయన మాట్లాడారు. ''ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. సభలో మెజార్టీ ఉన్నదని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్రాలకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి డ్యామ్‌లు చాలా ముఖ్యమైనవి. దేశంలో 5,701 డ్యామ్‌లు ఉన్నాయి. ఈ బిల్లులో రాష్ట్రాలు స్వంత ప్రయోజనాల సామర్థ్యాన్ని పరిరక్షించే అంశాలకు వ్యతిరేకంగా, చాలా ప్రమాదకరమైన నిబంధలను ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్నింటికి వర్తిస్తుందని బిల్లు చెబుతున్నది. కానీ రాజ్యాంగం ప్రకారం నీరు అనేది రాష్ట్ర జాబితా అంశమని, కానీ ఈ బిల్లుతో నీటికి సంబంధించిన అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తాయి. ప్రజల ప్రయోజనాలకు ఇది విఘాతం కలిగిస్తోంది. అధికారాలన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. రాజ్యాంగంలోని సమాఖ్య విలువలకు ఇది వ్యతిరేకం. ఇటీవలి రాష్ట్ర జాబితాకు సంబంధించిన వ్యవసాయంపై చట్టాలు చేశారు. కానీ ఒత్తిడి వల్ల వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. భిన్నత్వం ఉన్న దేశంలో కేంద్రం తన అధికారాలను జొప్పిస్తున్నది'' అని విమర్శించారు. డ్యామ్ సేఫ్టీ రాష్ట్ర హక్కు అని, కానీ ఈ బిల్లు రాష్ట్ర స్వతంత్రతను కేంద్రం లాక్కొంటుందని అన్నారు. ప్రస్తుతం ఉద్యమాలు జరుగుతున్నాయనీ, రేపటి రోజున అధికార పార్టీ తమ ఆలోచనలను మార్చుకుంటుందని తెలిపారు. లేబర్ కోడ్స్, వ్యవసాయ చట్టాలు అలానే తీసుకొచ్చిందనీ, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని ఆరోపించారు. నేషనల్ కమిటీ ఆన్ డ్యాం సేఫ్టీలో కూడా కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వారనీ, మిగతా వారంతా కేంద్రానికి చెందిన వారని అన్నారు. కమిటీ సభ్యులను కూడా కేంద్రమే నియమిస్తోందనీ, ఈ ఏడు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎటువంటి హామీ ఇస్తారు.? 13 మంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారే కమిటీలో ఉంటారని, రాష్ట్రాలకు చెందిన వారు ఏడుగురు ఉండట వల్ల, రాష్ట్రాలు వినిపించే గళం..తగ్గిపోతోందని వివరించారు. కేవలం నోటిఫికేషన్ ద్వారానే కమిటీని మార్పులు చేయొచ్చని నిబంధన అప్రజాస్వామం అని అన్నారు. ఈ దేశాన్ని ఇటుకలు, రాళ్లు, బుల్లెట్లు, గన్స్‌తో నిర్మించలేదనీ, రైతులు, కార్మికుల శ్రమతోనూ, మేథావుల ఆలోచనలతోనూ నిర్మించారని తెలిపారు. ఆ ఆలోచనలపైనే దాడి జరుగుతోందని అన్నారు. రాష్ట్రాల హక్కులపైన, దేశ భిన్నత్వంపైన జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా తాము పోరాడుతామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల చేత నడుస్తున్నదనీ, కార్పొరేట్ లూటీ కొనసాగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ''మరో ప్రపంచ, మరో ప్రపంచ పిలిచింది...పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పైపైకి'' అంటూ శ్రీశ్రీ వ్యాఖ్యలను ఆయన ఉటంకించే సరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలోని అధికార కేంద్రీకరణ జరిగే ఈ బిల్లును తిరస్కరించాలని కోరారు.